Accident: లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 16 మందికి తీవ్ర గాయాలు

by Kema Shiva Kumar |

సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద NH 65పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది.

Accident: లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 16 మందికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై ఇవాళ తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు వెళ్తున్న ఇంటర్‌సిటీ ట్రావెల్స్ బస్సు, ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న బస్సు లారీని ఢీకొట్టడంతో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు..

ప్రమాదం జరిగిన వెంటనే బస్సు మెయిన్ డోర్ జామ్ అయిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, అప్రమత్తమైన ప్రయాణికులు ఎమర్జెన్సీ విండో ద్వారా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించారు.

Next Story