సూర్యాపేట DSP పార్థసారథి ఇంట్లో ACB సోదాలు.. భారీగా బుల్లెట్స్ లభ్యం

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-13 15:13:30  IST  )

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి(DSP Parthasarathy) ఇంట్లో ఏసీబీ(ACB) అధికారులు సోదాలు చేశారు.

సూర్యాపేట DSP పార్థసారథి ఇంట్లో ACB సోదాలు.. భారీగా బుల్లెట్స్ లభ్యం
X

దిశ, వెబ్‌డెస్క్/సిటీక్రైం: సూర్యాపేట డీఎస్పీ పార్థసారధి ఏసీబీ కేసులో కొత్త ట్విస్టు వెలుగులోకి వచ్చింది. హాయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దత్తాత్రేయ కాలనీలోని పార్ధసారధి ఇంట్లో రెండో రోజు సోదాలు జరిపిన ఏసీబీ అధికారులకు అతని ఇంట్లో ఊహించని విధంగా 61 బుల్లెట్ క్యాట్రిడ్జిలు, 29 లైవ్ బుల్లెట్ రౌండ్‌లు దొరికాయి. దీంతో ఏసీబీ అధికారులు ఈ బుల్లెట్‌ల వ్యవహారంపై హాయత్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో హాయత్ నగర్ పోలీసులు డీఎస్పీ పార్థసారధిపై కేసు నమోదు చేసి బుల్లెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. పార్థసారధి ఈ బుల్లెట్‌లను 1992 నుంచి 1997 వరకు స్పెష్టల్ పార్టీ కానిస్టేబుల్‌గా ఏటూరు నాగారంలో పనిచేసిన సమయంలో కొన్ని బుల్లెట్‌లను దాచిపెట్టుకున్నాడని, ఆ తర్వాత ఎస్ఐగా ఎంపికై పదోన్నత్తులు పొంది తాజాగా డీఎస్పీగా పని చేస్తున్నంత వరకు బుల్లెట్‌లను తన వద్ద ఉంచుకున్నాడని తెలిసింది.

అయితే పోలీసు అధికారిగా బుల్లెట్‌లను తీసుకున్నప్పుడు వాటికి సంబంధించిన రికార్డును కచ్చితంగా బెల్ ఆఫ్ ఆర్మ్స్‌లో నమోదు చేయాలి. తిరిగి అప్పజెప్పే సమయంలో కూడా వాటి వివరాలను నమోదు చేయాలి. కానీ అలా చేయకుండా పార్థసారధి అక్రమంగా ఈ బుల్లెట్‌లను ఎందుకు పెట్టుకున్నాడనే విషయం ఏసీబీ అధికారులకు అంతుచిక్కడం లేదు. అయితే ఇన్ని బుల్లెట్‌లను తన వద్ద పెట్టుకున్నా పోలీసు రికార్డుల్లో వాటిని ఎవరు గుర్తించలేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ రికార్డుల పరిశీలనలో కూడా సంబంధిత అధికారలు నిర్లక్ష్యం స్పస్టంగా కనపడుతుంది. పార్థసారధి దగ్గర ఇన్ని బుల్లెట్ లు ఎలా జమ అయ్యాయని తేలాల్సి ఉంది. వీటన్నింటి లెక్కలను పార్థసారధి పని చేసిన చోట ఉండే బెల్ ఆఫ్ ఆర్మ్స్ రికార్డులలో నమోదు చేశాడా లేదా విషయాలను ఇప్పుడు హాయత్ నగర్ పోలీసులు తమ దర్యాప్తులో పరిశీలించే అవకాశం ఉంది.

పార్థసారధిని ఏసీబీ అధికారులు లంచం డిమాండ్ చేసిన కేసులో అరెస్టు చేసి రిమాండ్ పంపిన తర్వాత హాయత్ నగర్ పోలీసులు పీటీ వారెంట్‌పై అతనిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని ఈ బుల్లెట్‌ల వ్యవహారంపై దర్యాప్తును చేయనున్నారు. బుల్లెట్‌ల వ్యవహారంపై హాయత్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. మరో వైపు డీఎస్పీ పార్థసారధి లంచం డిమాండ్ కేసులో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులకు ఆయన ఇంట్లో భారీగా ల్యాండ్ డాక్యుమెంట్‌లు దొరికాయి. వీటి బహిరంగ మార్కెట్లో కోట్లాది రూపాయాలు విలువ చేస్తుందని సమాచారం.

Next Story