షాకింగ్: స్కూల్ బస్సును ఢీకొన్న అతివేగపు కారు!

by Gantepaka Srikanth |

హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

షాకింగ్: స్కూల్ బస్సును ఢీకొన్న అతివేగపు కారు!
X

దిశ, వెబ్‌డెస్క్: హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒగ్లాపూర్ గ్రామం సమీపంలో అతివేగంగా వచ్చిన ఒక కారు, విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. కారు అత్యంత వేగంగా ప్రయాణిస్తూ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఈ దెబ్బకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పాఠశాల విద్యార్థులు ఉండటంతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళన నెలకొంది.

సురక్షితంగా విద్యార్థులు..

ఈ ప్రమాదంలో స్కూల్ బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, అదృష్టవశాత్తూ బస్సులో ఉన్న విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, బస్సులోని పిల్లలను సురక్షితంగా కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్‌ను, కారులోని ముగ్గురిని వెంటనే చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమా లేక మరేదైనా సాంకేతిక లోపమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. "పిల్లలకు ఏమీ కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. స్కూల్ బస్సు డ్రైవర్లు, ఇతర వాహనదారులు మలుపుల వద్ద జాగ్రత్తగా ఉండాలి" అని పోలీసులు సూచించారు.

Next Story