రాజస్థాన్ లో 27 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్​

by Sridhar Babu |
రాజస్థాన్ లో 27 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్​
X

దిశ, సిటీక్రైం : తెలంగాణను సైబర్ సేఫ్ రాష్ట్రంగా మార్చేందుకు తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరో జీరో టాలరెన్స్ కార్యక్రమం చేపట్టింది. ఈ నేపధ్యంలో సైబర్ సెక్యురిటీ బ్యూరో అధికారులు సెప్టెంబర్ నెలలో రాజస్థాన్ లో స్పెషల్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో దాదాపు 27 మంది సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలను అందిస్తున్న వారిని అరెస్టు చేయగా మరో 33 మందిని గుర్తించారు. 27 మందిని అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చి రిమాండ్ కు తరలించారు. అరెస్టయిన 27 మంది 29 బ్యాంక్ ఖాతాల ద్వారా తెలంగాణలో నమోదైన 189 కేసులలో రూ.9 కోట్లు కొట్టేశారని తేలింది. దేశవ్యాప్తంగా ఈ ముఠాపై 2223 కేసులు నమోదనట్లు టీజీ సైబర్ సెక్యురిటీ డైరెక్టర్ షికా గోయెల్ మంగళవారం పోలీసు కమాండ్​ కంట్రోల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. రాజస్థాన్ లోని జైపూర్, నాగౌర్, జోధ్పూర్ ప్రాంతాల్లో ఈ స్పెషల్ ఆపరేషన్ ను నిర్వహించినట్లు షికా గోయెల్ వివరించారు.

పట్టుబడ్డ నిందితుల నుంచి 31 మొబైల్ ఫోన్లు, 37 సిమ్ కార్డులు, 13 ఏటీఎం కార్డులు, 7 చెక్ బుక్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరు తెరిచిన ఖాతాలన్నింటినీ విదేశాలలో ఉన్న సైబర్ నేరగాళ్లు అందించే కమీషన్ లు తీసుకుంటూ అమాయకులను మోసం చేస్తున్నారని డైరెక్టర్ చెప్పారు. ఈ ఖాతాల వెనకాల బ్యాంక్ సిబ్బంది పాత్రపై ఆరా తీస్తున్నామన్నారు. దేశంలో మొదటి సారిగా ఈ విధంగా ప్రత్యేకంగా సైబర్ నేరగాళ్ల కోసం స్పెషల్ ఆపరేషన్ చేయడంతో సైబర్ మోసగాలల్లో కలవరం రేపినట్టైందన్నారు. విదేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లకు లింక్ గా ఉన్న ఇలాంటి ఖాతాలను అందించే వారి కోసం ఇతర రాష్ట్రాల్లో ఇక తరుచూ స్పెషల్ ఆపరేషన్లను నిర్వహిస్తామన్నారు.

ఇలా సైబర్ నేరాలను నియంత్రించేందుకు కృషి చేస్తున్నామని షికా గోయెల్ అన్నారు. మరో వైపు గత నెల 28న జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో సైబర్ క్రైం కేసులకు సంబంధించి దాదాపు 5355 మంది సైబర్ నేరాల బాధితులకు దాదాపు 27.02 కోట్ల రూపాయలను అందించినట్లు తెలిపారు. ఇందులో టాప్ 5 లో సైబరాబాద్ 2860 కేసులలో రూ.13.73 కోట్లు, రాచకొండ 555 కేసుల్లో రూ.3.01 కోట్లు, టీజీ సీఎస్బీ 93 కేసులలో రూ.2.50 కోట్లు, సంగారెడ్డి 140 కేసులలో రూ.1.91 కోట్లు, కరీంనగర్ 176 కేసులలో రూ.84.21 లక్షలు తిరిగి బాధితుల ఖాతాలకు చేరవేశారని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed