- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉల్లిపాయల ఆటోలో బయటపడ్డ భారీ స్మగ్లింగ్
మదనపల్లి పోలీసులు భారీ స్మగ్లింగ్ కేసును ఛేదించారు. ఉల్లిపాయల వ్యాపారం మాటున జరుగుతున్న అక్రమాన్ని వెలుగులోకి తెచ్చారు.

దిశ, మదనపల్లె: జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఉల్లిపాయల వ్యాపారం ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ గంజాయి స్మగ్లింగ్ నెట్‌వర్క్ ను మదనపల్లె తాలూకా పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం..
మదనపల్లె డీఎస్పీ ఎస్. మహేంద్ర ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కె. కళా వెంకటరమణ, సిబ్బంది సోమవారం మదనపల్లె – తిరుపతి ప్రధాన రహదారిలోని యర్రగానిమిట్ట వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నంబర్ ప్లేట్ లేని ఒక లగేజీ ఆటో పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని ఆపి తనిఖీ చేయగా, పైకి ఉల్లిపాయ బస్తాలు పేర్చి ఉన్నాయి. అయితే, పోలీసులు ఆ బస్తాలను తొలగించి లోతుగా పరిశీలించగా, వాటి కింద దాచి ఉంచిన 9 గంజాయి బస్తాలు బయటపడ్డాయి. వీటిలో సుమారు 179 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 44,65,000 ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న మదనపల్లె చంద్ర కాలనీకి చెందిన ఆవుల నాగరాజ (23), ఆవుల సుగుణ (29)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ ముఠాలో మరో నలుగురు సభ్యులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.






