పెట్రోల్ ధరల పెంపుపై సీపీఐ ఆగ్రహం

by  |
పెట్రోల్ ధరల పెంపుపై సీపీఐ ఆగ్రహం
X

దిశ, న్యూస్‌బ్యూరో: అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర పడిపోతుంటే దేశంలో బీజేపీ ప్రభుత్వం మాత్రం ఎక్సైజ్ సుంకాన్ని పెంచి ప్రజలపై భారం మోపిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. హైదరాబాద్‌ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడారు.

ఒకవైపు కరోనా నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ నిబంధనలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ భారం మోపడం బాధాకరమన్నారు. 45 రోజుల లాక్‌డౌన్‌లో కేంద్రం 130కోట్ల ప్రజలకు ఇచ్చిందేమి లేదని, పైగా పెట్రోల్ ధరలు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేద ప్రజలకు రూ.10వేలు, బియ్యం అందజేయాలని డిమాండ్ చేశారు. కష్టకాలంలో రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకోలేని కేంద్ర ప్రభుత్వం మద్యం విక్రయించడానికి అనుమతించిందని ఎద్దేవా చేశారు. నలభై రోజులుగా లాక్‌డౌన్ పేరుతో ప్రజలు పడుతున్న కష్టం మద్యం షాపులు తెరవడంతో వృథా అవుతుందన్నారు.

చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు లేని ప్రజాస్వామ్యం అర్థం లేదని, ప్రతిపక్షాలను సీఎం కేసీఆర్ గౌరవించాలని సూచించారు. నియంతృత్వం, నిరంకుశత్వం పనికిరాదన్నారు. ‘సీఎం కేసీఆర్ ఎలాగో ప్రతిపక్షాలను కలవడు, అలాగే మాకు ఆయనను కలవాలనేమి ఉండదు, కానీ ప్రజా సమస్యలపై గవర్నర్, చీఫ్ సెక్రటరీలను కలుస్తే తప్పేంటి’ అని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోడీకి ఆదర్శమని అక్కడా లాక్‌డౌన్ ఎత్తేస్తే ఇక్కడ సడలింపులిచ్చి మద్యం షాపులకు అనుమతించారని ఎద్దేవా చేశారు.

Tags: Cpi, Narayana, Modi, Trump, Governor, Chief secretary, petrol


Next Story

Most Viewed