గుంటూరు వైసీపీలో కార్పొరేషన్ ఎన్నికల చిచ్చు..

by  |
giri
X

దిశ, ఏపీ బ్యూరో : గుంటూరు జిల్లా వైసీపీలో కార్పొరేషన్ ఎన్నికల చిచ్చురేగింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు కార్పొరేషన్ 6 డివిజన్‌కు సంబంధించి వైసీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో నేతలు అసహనం వ్యక్తం చేశారు. స్థానికేతరుడు అయిన అత్మకూరి నాగేశ్వర్ రావుకు టికెట్ ఇచ్చారంటూ ఎమ్మెల్యే మద్దాలి గిరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మద్దాలి గిరి టికెట్ అమ్ముకున్నాడని వైసీపీ పార్లమెంట్ జాయింట్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి పేరుతో కరపత్రాలు పంచారు.

ఈ కరపత్రాల్లో ఎమ్మెల్యే మద్దాలి గిరిపై సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే మద్దాలి గిరి మానసిక ఒత్తిడికి గురిచేయడంతోనే ఆరో డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందిన పాదర్తి రమేష్ గాంధీ చనిపోయారని ఆరోపించారు. మేయర్ పదవి కోసం గాంధీ నుంచి ఎమ్మెల్యే గిరి రూ.4 కోట్లు వసూలు చేశారని కరపత్రాల్లో ఆరోపించారు. రమేష్ గాంధీ కుటుంబ సభ్యులకు కాకుండా పల్నాడుకు చెందిన వ్యక్తికి టికెట్ అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. మద్దాలి గిరికి దమ్ముంటే ఈటల రాజేందర్‌లా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు.

మెుత్తానికి ఈ కరపత్రాలు నియోజకవర్గంలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇకపోతే ఆరోడివిజన్ నుంచి పోటీ చేసిన రమేశ్ గాంధీ మరణించడంతో ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు ఆ డివిజన్‌కు ఎన్నిక కానున్న సంగతి తెలిసిందే.

Next Story