కరోనా పేరుతో ప్రైవేటు దోపిడీ..

by  |
కరోనా పేరుతో ప్రైవేటు దోపిడీ..
X

“నేనొక మహిళా డాక్టర్‌ను. నాకు, నా తండ్రికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇద్దరమూ గచ్చిబౌలిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాం. ఆక్సిజన్, సెలైన్ లాంటివేమీ పెట్టలేదు. బిల్లులో మాత్రం ఆ పేరుతో ఛార్జీలు వేశారు. అడిగినందుకు నిష్టూరమాడారు. మొత్తం కడితేనే డిశ్చార్జి చేస్తామన్నారు. ట్రీట్‌మెంట్ ఇవ్వనప్పుడు బిల్లు ఎందుకు కట్టాలి? నాకు కనీసం ఒక్క మాత్ర కూడా ఇవ్వలేదు. పల్మనాలజిస్టు వచ్చి చూసెళ్లినట్లు దబాయిస్తున్నారు. అందుకే సెల్ఫీ వీడియో ద్వారా వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం’’ – డాక్టర్ విజయ కేసరి

దిశ, న్యూస్ బ్యూరో: ఇది ఒక డాక్టర్ అనుభవమే కాదు.. కరోనా పేషెంట్లకు చికిత్స అందించేలా, నిర్ధారణ పరీక్షలు చేసేలా కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి ఇవ్వడంతో సామాన్యులకూ కష్టాలు వచ్చి పడ్డాయి. కరోనాకు మందు, చికిత్స లేదని తెలిసినా కార్పొరేట్ ఆసుపత్రులు రకరకాల పేర్లతో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ క్లిష్ట సమయాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. వీటిపై ప్రభుత్వానికి నియంత్రణ కరువైంది. ఫిర్యాదు లేకుండా, సెల్ఫీ వీడియోలను ఆధారంగా చేసుకుని చర్యలు చేపట్టలేమని ప్రభుత్వాధికారులు చేతులెత్తేస్తున్నారు. సామాన్యుల నుంచి ట్విట్టర్ ద్వారా గవర్నర్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో ఆమె 11 కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వ్యాపార దృక్పథం వద్దని స్పష్టం చేశారు. అయినా, వాటి దోపిడీ ఆగడం లేదు. ‘దీపమున్నప్పుడే’ అన్న చందంగా కరోనా ఉన్న సమయంలోనే అందినకాడికి దోచుకుంటున్నాయి.

మరో డాక్టర్ కు కూడా..

డాక్టర్ విజయ కేసరి సంఘటనకు కొన్ని రోజుల ముందు ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుల్తానా కరోనా పాజిటివ్ కారణంగా చాదర్ఘాట్లోని తుంబే ఆసుపత్రిలో చేరారు. వారు ఒక్క రోజుకే రూ.1.15 లక్షల బిల్లు వేశారు. అంత మొత్తం కట్టలేకపోవడంతో మూడు రోజుల పాటు డిశ్చార్జి చేయకుండా ఆసుపత్రిలోనే బంధించారు. చివరకు సెల్ఫీ వీడియో ద్వారానే ఆమె బాధ వెలుగులోకి వచ్చింది. దీన్ని చూసి స్పందించిన వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఆమెకు నిమ్స్ లో నిమ్స్ లో చేర్పించి చికిత్స అందించేందుకు చొరవ తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు నగరంలోని కార్పేరేట్ ఆసుపత్రుల్లో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఆపద ఈ ఆసుపత్రులకు ఆదాయ వనరుగా మారింది. కరోనా పేషెంట్ల నుంచి ఎంత మేరకు వసూలు చేయాలో నిర్దిష్టంగా బెడ్, వార్డు ఛార్జీలను ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ఆస్పత్రుల నిర్వాహకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎంత వీలైతే అంత గుంజడానికి ప్రయత్నిస్తున్నారు. డాక్టర్ సుల్తానా వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ కూడా విచారణలో ఉంది. గవర్నర్ చెప్పినా వీటికి లెక్క లేదు. ప్రభుత్వ ఉత్తర్వులు పట్టవు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరడానికి సవాలక్ష ఆటంకాలు ఉన్నాయి.. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోడానికి ఆర్థిక స్థోమత ఉండడం లేదు. దీంతో దిగువ మధ్య తరగతి, పేద ప్రజలకు కష్టాలు తప్పడం లేదు.

ఫిర్యాదు ఇస్తే చర్యలు..

ప్రభుత్వం నిర్ణయించిన ధరకన్నా ఎక్కువ వసూలు చేస్తే ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. దీని ఆధారంగా ఆ ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రెండు ఆసుపత్రులపై ఫిర్యాదులు వచ్చాయి. నోటీసులు జారీ చేశాం. సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. కరోనా చికిత్సకు వసూలు చేసే ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. మిగిలిన చికిత్సలకు సంబంధించిన ఛార్జీల అంశం రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ కౌన్సిల్ పరిధిలో ఉంటుంది. ప్రస్తుతానికి రాష్ట్ర కౌన్సిల్‌కు కూడా ఆ అధికారం లేదు. కేంద్ర కౌన్సిల్ పరిధిలోనే ఉంది. కరోనా పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని కార్పొరేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటూ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. పేషెంట్లు కూడా వారి ఆరోగ్య అవసరాల కోసం హడావుడిగా ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఫిర్యాదు లేకుండా చర్యలు తీసుకునే అధికారం మాకు లేదు. ఫిర్యాదు ఇస్తే స్పందిస్తాం. జిల్లా వైద్యాధికారికి కూడా ఇలాంటి ఫిర్యాదు ఇవ్వవచ్చు. సెల్ఫీ వీడియోల ఆధారంగా ప్రజారోగ్య శాఖ స్పందించడం సాధ్యం కాదు. – డీహెచ్ జి. శ్రీనివాసరావు

Next Story

Most Viewed