తగ్గిన ఉపాధి రేటు!

by  |
తగ్గిన ఉపాధి రేటు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి వచ్చాక పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కరోనా వ్యాప్తితో ఇండియాలో పరిస్థితులు మరింత దిగజారాయి. మార్చిలో ఉపాధి రేటు ఆల్-టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. నిరుద్యోగిత రేటు ఊహించని విధంగా మొదటిసారి రెండంకెల స్థాయికి పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఎకానమీ(సీఎమ్ఈఈ) గణాంకాల ప్రకారం మార్చి 29తో ముగిసిన వారంలో నిరుద్యోగిత రేటు దాదాపు మూడు రెట్లు పెరిగి 8.4 శాతం నుంచి 23.8 శాతానికి చేరుకుంది. మార్చిలో నిరుద్యోగిత రేటు 8.7 శాతంగా ఉండేది. ఇది 43 నెలల కనిష్ఠమని, జనవరిలో 7.16 శాతం నుంచి వేగంగా పెరిగిందని థింక్ ట్యాంక్ ఇటీవల నివేదిక ఇచ్చింది. అయితే, మార్చి నెలలో ఒక్కసారిగా కరోనా వ్యాప్తితో ఊహించని స్థాయిలో తొలిసారి రెండంకెలకు నిరుద్యోగ రేటు చేరుకుందని నివేదిక పేర్కొంది.

ఇక, ఉపాధి రేటు మార్చి నెలలో 38.2 శాతానికి పడిపోయింది. లాక్‌డౌన్ పొడిగించిన కారణంగా పరిస్థితి మరింత దారుణంగా ఉండనుందని సీఎమ్ఐఈ తెలిపింది. ఏప్రిల్ తొలి రెండు వారాల్లో పరిస్థితుల్లో మార్పేమీ లేదు. ఏప్రిల్ 12 నాటికి 30 రోజుల సగటు నిరుద్యోగ రేటు 13.5 శాతంగా ఉంది. లాక్‌డౌన్ కారణంగా వ్యవసాయ కార్యకలాపాలు నిలిపోయినందున గ్రామీణ నిరుద్యోగం 13.08 శాతానికి చేరుకోగా, పట్టణ ప్రాంతాల్లో 14.53 శాతానికి చేరింది. జనవరి నుంచి మార్చి నెలల మధ్య ఉద్యోగుల సంఖ్య 41.1 కోట్ల నుంచి 39.6 కోట్లకు పడిపోయింది. నిరుద్యోగుల సంఖ్య 3.2 కోట్ల నుంచి 3.8 కోట్లకు పెరిగింది. శ్రామిక శక్తిలో నిరుద్యోగుల సంఖ్య 60 లక్షలు పెరిగింది.

Tags: Unemployment In India, Unemployment, Unemployment Rate, Unemployment Rate In India, India

Next Story