కరోనాతో బీజేపీ సీఎంలకు పదవీగండం..?

by  |
BJP
X

బెంగళూరు: కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టడంతోపాటు కొందరు నేతల భవితవ్యాన్నీ ప్రశ్నార్థకం చేస్తున్నది. వేలాదిగా ప్రజలను పొట్టనబెట్టుకుంటూ మృత్యుబేహారిగా విజృంభిస్తుంటే దాన్ని నిలువరించడంలో వెనుకంజపట్టిన రాష్ట్రాల ముఖ్యమంత్రులపై విమర్శలు పదునుదేలుతున్నాయి. సొంతపార్టీలోనే ప్రభుత్వ వ్యవహారంపై అసంతృప్తిగానాలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు ఏడాది దూరంలోపే ఉంటే వీటికి మరింత ప్రాముఖ్యత లభిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్నదిదే.

యూపీ గ్రామీణంలో అధికారిక లెక్కలకు మించి మరణాలు సంభవించాయన్న అంచనాలు, మృతదేహాలు గంగ నదిలో కొట్టుకుపోవడం, నది పరివాహక ప్రాంతాల్లో ఖననం చేసిన మృతదేహాలు వరదలతో బయటపడటం వంటి వాటితో యోగి ప్రభుత్వంపై విమర్శలు తీవ్రమయ్యాయి. వచ్చే ఏడాది తొలినాళ్లలోనే యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, తర్వాతి సార్వత్రిక ఎన్నికలపై యూపీ అసెంబ్లీ ఫలితాల ప్రభావముండటం అధికారపార్టీలో కలవరానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలోనే యూపీ ప్రభుత్వంలో భారీ మార్పులు జరుగుతాయన్న చర్చ జరిగింది. ఆర్ఎస్ఎస్ నేతలు, బీజేపీ పెద్దల బృందమూ యూపీ వెళ్లడం, సమీక్షలు చేయడం ఈ వాదనలకు బలాన్నిచ్చినా, చివరికి అలాంటి మార్పులేమీ ఉండవని సూత్రప్రాయంగా ప్రకటనలు వచ్చాయి. తాజాగా, బీజేపీ సీనియర్ లీడర్, యూపీ ఇన్‌చార్జ్ రాధా మోహన్ సింగ్ సీఎం యోగితో రివ్యూ మీటింగ్ చేసిన రోజుల వ్యవధిలోనే గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌తో ఆదివారం భేటీ కావడం చర్చకు తావిచ్చింది. కానీ, ఇది మర్యాదపూర్వ సమావేశమేనని, యోగి అద్భుతంగా పనిచేస్తున్నారని భేటీ అనంతరం ఆయన పేర్కొన్నారు.

ప్రత్యామ్నాయ నేతలూ ఉన్నారు

కర్ణాటకలోనూ ఇదే విధంగా సీఎం బీఎస్ యడియూరప్ప కరోనా కట్టడి పనితీరుపై సొంతపార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది. కరోనా ఫస్ట్ వేవ్ నుంచీ సీఎంపై రాష్ట్ర పర్యాటక మంత్రి యోగీశ్వర సహా పలువురు బీజేపీ నేతలు ఢిల్లీకి పలుమార్లు పర్యటించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు తప్పదని చర్చ జరుగుతున్న తరుణంలో సీఎం బీఎస్ యడియూరప్ప వాటికి ఫుల్‌స్టాప్ పెడుతూ, హై కమాండ్ ఆదేశిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. హై కమాండ్‌కు తనపై నమ్మకం ఉన్నన్ని రోజులు సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని, ఎప్పుడైతే వారు కాదంటారో వెంటనే రాజీనామా చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తానని అన్నారు. తనకు వచ్చిన అవకాశం మేరకు ఈ పదవిలో ఉన్నారని అన్నారు.


Next Story

Most Viewed