అమెరికన్లకు ఇదేం పిచ్చో… కరోనా వైరస్ పార్టీలు

by  |
అమెరికన్లకు ఇదేం పిచ్చో… కరోనా వైరస్ పార్టీలు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని వాషింగ్టన్‌ నివాసితులు కరోనా వైరస్ పార్టీల పేరుతో ఆరోగ్య అధికారులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు. ఈ పార్టీల్లో కొవిడ్ 19 పాజిటివ్ అని తేలిన వారితో వైరస్ సోకని వారు కలిసి పార్టీలు చేసుకుని కావాలని వైరస్ అంటించుకుంటున్నారట. వైరస్ అంటించుకుని, తగ్గించుకోవడానికి విజయంగా భావిస్తూ వాళ్లు ఈ పని చేస్తున్నారట. దీని గురించి వాషింగ్టన్ ఆరోగ్య అధికారులు నివాసితులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇలా చేయడం బాధ్యతారాహిత్యం అని మొత్తుకుంటున్నా వారు వినిపించుకోవట్లేదు.

ఇలా చేయడానికి కారణం లేకపోలేదు. గతంలో చికెన్ పాక్స్ వ్యాధికి గురైన పిల్లలను పిలిచి, యూఎస్‌లో తల్లిదండ్రులు పార్టీ ఇచ్చేవారట. వారి నుంచి తమ పిల్లలకు కావాలని చికెన్ పాక్స్ అంటించుకునేవారట. చికెన్ పాక్స్ దాదాపుగా జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుంది. ఒకసారి శరీరంలో దాన్ని కట్టడి చేసే యాంటీబాడీస్ వృద్ధి చెందిన తర్వాత ఆ వైరస్ మళ్లీ రాదు. కాబట్టి అలా చేసేవారట. అయితే కరోనా విషయంలోనూ అదే జరుగుతుందేమోనని వారు ఇలా కరోనా వైరస్ పార్టీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరికొన్ని చోట్ల పాజిటివ్ రోగి కరోనా జయించి ఇంటికి వచ్చిన తర్వాత అతనికి వెల్‌కమ్ పార్టీలు కూడా ఇస్తున్నారట. అయితే కరోనా వైరస్ గురించి పూర్తిగా తెలియని సమయంలో, ఆ వైరస్ పైకి కనిపించకుండా మనిషి శరీరంలో ఎంతకాలం ఉంటుందో నిర్ధారించలేని పరిస్థితుల్లో ఇలా చేయడం సబబుకాదని అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ వినిపించుకోవడం లేదు.

Tags: corona, covid, corona virus parties, america, washington, positive, chicken pox, infection, anti bodies

Next Story

Most Viewed