కరోనా వేళ.. చాలెంజెస్ భళా

by  |
కరోనా వేళ..  చాలెంజెస్ భళా
X

దిశ వెబ్ డెస్క్: కరోనా కారణంగా… అందరూ ఇంట్లో క్వారంటైన్ అయిపోయారు. మామూలు రోజుల్లోనే ఎంతోమంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. మరి కరోనా టైమ్ లో .. మొబైల్ కే అంకితమైపోతారనడంలో అతిశయోక్తి లేదు. బ్యాడ్ టైమ్ లోనే సమాజానికి ఉపయోగపడే గుడ్ చాలెంజెస్ బయటకు వస్తుంటాయి. ఫన్నీ చాలెంజెస్ కూడా ఉంటాయనుకోండి. ఏదైతేనేం ప్రజలను, నెటిజన్లను ఎంటర్ టైన్ చేయాలి. ఆ చాలెంజ్ వల్ల ఎవరూ కూడా నొచ్చుకోకూడదు. ఆ మధ్య రైస్ బకెట్ చాలెంజ్, ఇటీవల గ్రీన్ చాలెంజ్ అలా పుట్టుకు వచ్చినవే. కరోనా వేళ… ఎన్నో చాలెంజెస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్’. దీని తర్వాత కొన్ని సరాదా చాలెంజెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కరోనా వైరస్ వల్ల వేలాది మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. లక్షలాది మంది అనారోగ్యం బారినపడ్డారు. కోట్లాది మంది భయం భయంగా బతుకుతున్నారు. అయితే.. కరోనాను అరికట్టాలంటే.. మొట్టమొదట మనం చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలి. ముక్కు, నోరు కనిపించకుండా టైట్ గా మాస్క్ ధరించాలి. కరోనా కట్టడి చేయడంలో ఇవే ప్రాథమిక విషయాలు. ప్రజల్లో తొలిగా అవగాహన కలిగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (who) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రాస్ అథనామ్ ‘సేఫ్ హ్యాండ్స్’ చాలెంజ్ ను మొదలుపెట్టారు. కరోనా నుంచి మనల్ని కాపాడుకోవాలంటే.. రెండు చేతులను ఇలా 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలని వీడియోలో చెప్పారు. అందుకే ఈ చాలెంజ్ ను మొదలు పెడుతున్నానని తెలిపారు. ఈ చాలెంజ్ ను ప్రపంచంలోని సెలెబ్రెటీలందరూ యాక్సెప్ట్ చేసి.. తాము చేతులు కడుక్కుంటూ ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రోజర్ ఫెదరర్, దీపికా పదుకునే, ప్రియాంక చోప్రా, చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబులతో పాటు చాలా మంది సెలబ్రిటీలు ఈ జాబితాలో ఉన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా చేతులు కడుక్కోవడమే తమ ప్రధాన ఉద్దేశమని టెడ్రాస్ అన్నారు. ఈ చాలెంజ్ ఎంత వైరల్ అయ్యిందో మనందరికీ తెలుసు.

టీ షర్ట్ చాలెంజ్:

కొన్ని చాలెంజస్ భలే ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని మీనింగ్ లెస్ గా ఉంటాయి. ఇంకొన్ని ఫిట్ నెస్ చాలెంజెస్ ఉంటాయి. ఇటీవల కాలంలో బాగా వైరల్ అవుతున్న ‘ టీషర్ట్ చాలెంజ్’ ఫన్నీగా ఉండటంతో పాటు, ఫిట్ నెస్ ను స్ట్రెంత్ ను కూడా తెలియజేస్తుంది. విదేశాల్లో బాగా పాపులర్ అవుతున్న ఈ చాలెంజ్ ను మన దగ్గర నటి నేహాశర్మ చెల్లెలు ఆయేషా శర్మ మొదలు పెట్టింది. అసలు ఏంటీ ఈ చాలెంజ్ అంటే… చేతులు రెండూ నేల‌కు ఆనిచ్చి, కాళ్ల‌ను పైకి లేపి గోడ‌ను తాకాలి. అది కూడా బోర్ల‌ప‌డుకొని. ఇలానే ఉంటూనే.. చేతుల‌తో టీ-ష‌ర్ట్ ధ‌రించాలి. ఇదే ఈ చాలెంజ్ ప్ర‌త్యేక‌త‌. చూస్తే.. చాలా సులువుగా ఉన్నా.. చేయడం మాత్రం చాలా కష్టం. ఒక‌సారి వీడియో చూస్తే తెలుస్తుంది. తాను టీ షర్ట్ ధరించి.. తన అక్క నేహా శర్మకు స‌వాల్‌ విసిరింది. నేహా శర్మ కూడా ఈ చాలెంజ్ ను యాక్సెప్ట్ చేసి .. టీ షర్ట్ ధరించింది. అయితే ఈ సమయంలో తన రిస్ట్ తో నేలను బ్యాలెన్స్ చేసుకున్నానని, తను చేసిన ఈ చిన్న మోసాన్ని క్షమించమని నేహా .. ఆయేషాకు తెలిపింది. ఇంట్లోనే ఉండండి. సుర‌క్షితంగా ఉండండి అంటూ హ్యష్ ట్యాగ్ చేసింది నేహా . ఈ వీడియోను ఇప్పటికే 12 లక్షల మంది చూశారు.

టాయ్ లెట్ పేపర్ రోల్ తో గిన్నిస్ రికార్డ్ కొట్టే చాన్స్:

ఎన్నో భిన్నమైన ఛాలెంజ్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వేళ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ కూడా ఓ ఛాలెంజ్ విసిరింది. ఇంట్లో ఊరికే కూర్చోకుండా తాము విసిరిన ఛాలెంజ్‌లో పాల్గొని సత్తా నిరూపించుకోమంది. టాయ్‌లెట్‌‌లో ఉపయోగించే టిష్యూ పేపర్ రోల్‌ను 30 సెకన్ల పాటు కింద పడకుండా గాల్లో ఎగరేయడమే ఈ కాన్సెప్ట్. ఓ అవలీలగా ఆ పని చేసేస్తామని అనుకుంటున్నారా? అక్కడే ఓ చిన్న తిరకాసు ఉంది. అదేంటంటే… ఇలా పేపర్ రోల్ ఎగరేయడానికి చేతుల్ని, మోచేతుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. అంతేకాదు.. కెమెరా ముందుకు వచ్చి… 3, 2, 1, రెడీ అని .. ఆ రోల్ ను ఎగరేయడం ప్రారంభించాలి. మనం చేసిన ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థకు పంపించాలి. వీడియో అప్‌లోడ్‌ చేసేందుకు సంస్థకు చెందిన అధికారిక ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాం అకౌంట్లను ఉపయోగించుకోవచ్చు. జీడబ్ల్యూఆర్ చాలెంజ్ అన్న హ్యాష్ ట్యాగ్ వీడియోకు జత చేయాలి. 30 సెకన్లలో ఎవరు ఎక్కువసార్లు ఎగరేస్తారో వాళ్లే గెలిచినట్లు. ఎగరేసే క్రమంలో పేపర్ రోల్ గోడకు, కుర్చీలకు తగిలినా, కిందపడినా ఫలితం ఉండదు. ఎడిట్ చేసిన వీడియోలు పరిగణలోకి తీసుకోరు. ప్రతి వారం ఓ విజేతను సంస్థ ప్రకటిస్తుంది. క్వారంటైన్ వేళ.. గిన్నిస్ రికార్డు కొట్టే చాన్స్ వచ్చింది.

సోలో డ్రిల్:

టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ .. భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లితో పాటు… అనేక మంది సెలెబ్రిటీలకు ఓ సరదా చాలెంజ్ విసిరాడు. అదే ‘సోలో డ్రిల్ చాలెంజ్ ’.అదేంటంటే.. ఫెదరర్.. తాను టెన్నిస్ రాకెట్ తో … బంతిని కొడుతూ.. సోలో డ్రిల్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. టెన్నిస్ ఎట్ హోమ్ హ్యాష్ ట్యాగ్ ను వీడియోకు జత చేశాడు. ‘అందరికీ ఉపయోగకరమైన సోలో డ్రిల్ .. మీరెలా చేస్తారో వీడియోతో రిప్లై ఇవ్వండి’అని ట్వీట్ చేశాడు.

మ్యారిడ్ బాయ్స్.. క్లీనింగ్ బౌల్స్:

ఎప్పుడూ షూటింగ్ లతో బిజిబిజీగా గడిపే సెలబ్రిటీలంతా… ఇంట్లో తమ కుటుంబ సభ్యులతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. తాము చేస్తున్న సరదా సరదా పనులను, తమ చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను ఖుష్ చేస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు వంట గదిలో ప్రయోగాలు చేస్తున్నారు. అయితే హీరోయిన్ శ్రీయ మాత్రం .. ఓ భిన్నమైన్ చాలెంజ్ తో మన ముందుకు వచ్చింది. అదేంటంటే.. కిచెన్ లో తన భర్త అండ్రీ కొచ్చిన్‌‌తో పాత్రలను శుభ్రం చేయిస్తున్న ఓ వీడియోను శ్రియ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేసింది. పెళ్లైన మగవాళ్లందరూ.. వారి అందమైన భార్యలకు సాయం చేయాలని, అందుకోసం నేను విసిరే ఈ ఛాలెంజ్‌ యాక్సెప్ట్ చేయాలని శ్రీయ అంటోంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా మీరంతా వంటగదిలో పాత్రలను శుభ్రం చేయాలని శ్రీయ కోరింది. అందుకోసం తన స్నేహితులైన అల్లు అర్జున్, తమిళ హీరో ఆర్య, జయం రవి, ఆశిష్ చౌదరిలను ఈ చాలెంజ్ కోసం నామినేట్ చేసింది.

నేక్డ్ ఛాలెంజ్:

ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న నేక్డ్ చాలెంజ్ .. ఇప్పటివరకైతే ఇండియాలో లేదు. అమెరికా సహా పాశ్చాత్య దేశాల్లో ఈ చాలెంజ్ వైరల్ గా మారింది. అమెరికాలో కరోనా కరాళా నృత్యం చేస్తుంటే.. యువతేమో .. ఇలాంటి వేలం వెర్రి ఆటలతో..నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్క అమెరికా అనే కాదు.. చాలా దేశాల్లో వింత వింత చాలెంజ్ లు సీరియస్ నెస్ ను అపహాస్యం చేస్తున్నాయి. పాశ్యాత్య దేశాల్లో ఈ మధ్య ట్విట్టర్ లో ట్రెండ్ హ్యాష్ ట్యాగ్ లను చూస్తే ఆ విషయం మనకు అర్థం అవుతుంది. అందులో . # పాండెమిక్ సెక్స్ టేప్ టైటిల్స్# కూడా ఒకటి.

సిల్లీ ఫొటో చాలెంజ్:

ఈ చాలెంజ్ లో భాగంగా…. అందంగా ఉన్న ఫోటో కాకుండా.. ఏదైనా సిల్లీ గా ఉన్న ఫోటోను అప్ లోడ్ చేసి … ఒక రోజంతా డిలీట్ చేయకుండా ఉంచాలి. ‘అన్టిల్ టుమారో’ అనే హ్యాష్ ట్యాగ్ తో దీన్ని జత చేయాలి. దీన్ని లైక్ కొట్టిన వాళ్లంతా కూడా ఈ చాలెంజ్ ను యాక్సెప్ట్ చేసినట్లే.

సాల్ట్ చాలెంజ్:

ఇదో అనారోగ్యకరమైన చాలెంజ్ అని చెప్పొచ్చు.
టిక్ టాక్ .. సాల్ట్‌ చాలెంజ్‌ పేరుతో మరో కొత్త చాలెంజ్‌ వచ్చి చేరింది. ఈ ఛాలెంజ్ లో నోటి నిండా ఉప్పు వేసుకోవాలి. జొనాథన్‌ అనే టిక్‌టాక్‌ యూజర్‌ ఈ చాలెంజ్‌ను టిక్‌టాక్‌కు పరిచయం చేశాడు. టిక్ టాక్ యూజర్లు ఏదీ ఆలోచించకుండా అందరూ దీన్ని ఫాలో అవుతున్నారు. ఈ ఛాలెంజ్ చాలా ప్రమాదమని.. ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడం శరీరానికి మంచిది కాదని నిపుణుల చెబుతున్నారు. దీనివల్ల రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలూ ఎక్కువగా ఉన్నాయని వాళ్లు తెలిపారు.

ట్రెడిషనల్ అండ్ కపుల్ చాలెంజెస్:

కరోనా టైమ్ లో .. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన చాలెంజెస్ లలో .. ‘ట్రెడిషన్ చాలెంజ్, కపుల్స్ చాలెంజ్’ ముందు వరసలో ఉంటుంది. చాలా మంది అమ్మాయిలు.. చీరలు కట్టుకుని.. ట్రెడీషన్‌గా రెడీ అయ్యి ‘ట్రెడిషన్ చాలెంజ్ యాక్సెప్టెడ్’అంటూ స్టేటస్‌లు పెడుతున్నారు. మరికొందరు తమ భర్తలలో ‘కపుల్స్ చాలెంజ్ యాక్సెప్టెడ్’ అంటూ ఫేస్ బుక్‌లో స్నేహితులకి ట్యాగ్ చేస్తున్నారు. మహా నగరాల నుంచి పల్లెటూల్ల వరకు అంతటా ఇది బాగా వైరల్ అయ్యింది. సీరియల్ నటులైన ప్రేమి విశ్వనాథ్, ప్రియాంక జైన్, సుజిత, కస్తూరి, మెరీనా, ఐశ్వర్య , హర్షితలు కూడా ఈ సారీ వేర్ చాలెంజ్ లో పాల్గొన్నారు.

లాక్ డౌన్ వేళ… నెటిజన్లు బోర్ కొట్టకుండా ఇలా చాలెంజెస్ తో టైమ్ పాస్ చేస్తున్నారు. ఏ చాలెంజ్ అయినా.. మన ఆరోగ్యానికి హానీ లేకుండా, ఇతరులను కించ పరచకుండా, నొప్పించకుండా ఉంటే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాలక్షేపానికి కాకుండా సమాజానికి ఉపయోగపడే చాలెంజ్ లు అయితే మరింత మంచిదని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

tags: corona virus, challenge, accepted, traditional, couple, tshirt, safe hands,naked,silly photo,



Next Story

Most Viewed