కరోనా టెస్టులు మరింత చౌక

by  |
కరోనా టెస్టులు మరింత చౌక
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా టెస్టుల ధరలు మరింతగా తగ్గనున్నాయి. రూ. 499 ఖరారు చేయాల్సిందిగా ప్రభుత్వానికి వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు పంపింది. నిర్ణయం తీసుకోవడమే తరువాయి. ప్రైవేటు లాబ్‌లు రూ. 850కి మించి ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులకు వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా టెస్టింగ్ కిట్ ధరలు తగ్గుముఖం పట్టడంతో పాటు స్వదేశీ ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగినందున ధరలను తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ సైతం అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రూ. 499 ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలో రేటు తగ్గించే అవకాశం ఉంది. వైరస్ వచ్చిన కొత్తలో బయట ప్రైవేటు లాబ్‌లు వేలాది రూపాయలు వసూలు చేస్తుండగా, తెలంగాణలో ప్రజలకు ఆర్థిక భారం కాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఈ టెస్టులు చేయాలనే నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు లాబ్‌లకు అనుమతి ఇవ్వలేదు. భారీ సంఖ్యలో చేయాల్సిన అవసరం ఏర్పడడంతో ప్రైవేటు లాబ్‌లకు అనుమతి ఇవ్వడంతో పాటు గరిష్ట ధరను రూ. 2,250కు మించవద్దని సీలింగ్ విధించింది.

అయితే ఇటీవలి కాలంలో టెస్టింగ్ కిట్‌లు ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి రావడం, రాపిడ్ టెస్టులు కూడా చేస్తుండడంతో ఆర్‌టీపీసీఆర్ టెస్టుల ధరలను రూ. 850కు తగ్గించింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆ ధరను మరింతగా తగ్గించి రూ. 499కే ఖరారు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉందని, వారం రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడతాయన్న ఆశాభావాన్ని ఆ ఉన్నతాధికారి వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed