ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీపై కరోనా ఎఫెక్ట్

by  |
online food delivery
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఫుడ్ డెలివరీకి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. లాక్ డౌన్ కారణంగా డెలివరీలు మోస్తరుగానే వస్తున్నా సరిపడా సిబ్బంది లేక ఇక్కట్లు తలెత్తుతున్నాయి. కొవిడ్ బారిన పడి కొందరు విధులకు దూరమైతే లాక్ డౌన్ కారణంగా మరికొందరు డెలివరీ బాయ్స్ విధులకు రావడం లేదు. గతేడాది లాక్ డౌన్ విధించినట్లుగానే ఈసారి కూడా విధిస్తారేమోనని భావించి ప్రకటన చేసిన రోజు రాత్రికి రాత్రే సిటీ విడిచి సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో ఉన్న కొంతమంది సిబ్బంది డెలివరీలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిబ్బంది కొరత కారణంగా పని గంటలు పెరగడంతో సతమతమవుతున్నారు.

అన్ని సంస్థల్లోనూ ఇదే పరిస్థితి

రాష్ట్రంలోని అన్ని ఫుడ్ డెలివరీ సంస్థల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. స్విగ్గీ, జొమాటో, డొమినాస్ వంటి సంస్థల్లోనూ పలువురు డెలివరీ బాయ్స్ కొవిడ్ బారిన పడ్డారు. దీంతో వారు హోం ఐసోలేషన్లలోనే చికిత్స పొందుతున్నారు. అయితే ఏ సంస్థ తమ సిబ్బంది బాగోగులను గురించి పట్టించుకోవడం లేదని పలువురు డెలివరీ బాయ్స్ చెప్పడం గమనార్హం. కాగా, జొమాటో సంస్థ మాత్రం తమ సిబ్బందికి పాజిటివ్ గా నిర్ధారణ అయితే అందుకు సంబంధించిన ప్రూఫ్ ను తమ యాప్ ద్వారా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే సిబ్బందికి క్వారంటైన్ పూర్తయ్యే వరకు రోజుకు రూ.500 చొప్పున అందజేస్తోంది.

డెలివరీ బాయ్స్‌కి ఫుల్ డిమాండ్

కొందరు డెలివరీ బాయ్స్ లాక్ డౌన్ కారణంగా సొంతూళ్లకు పయనమయ్యారు. మరికొందరు కరోనాతో క్వారంటైన్ లో ఉన్నారు. దానికి తోడు ఆర్డర్లు కూడా గతంకంటే మోస్తరుగా పెరిగాయి. దీంతో ఫుడ్ డెలివరీ బాయ్స్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సిబ్బంది తక్కువగా ఉండటంతో ఉన్నవారికి సంస్థలు కమిషన్ బాగానే అందజేస్తున్నాయి. అయితే ఉదయం నుంచి మొదలు రాత్రి వరకు డెలవరీలు చేస్తుండటంతో పని ఒత్తిడి పెరిగి సతమతమవుతున్నారు.

300లకు పైగా పాజిటివ్ కేసులు

తెలంగాణ వ్యాప్తంగా కొవిడ్ సెకండ్ వేవ్ లో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీలతో పాటు అమెజాన్ డెలివరీ బాయ్స్ ను కలుపుకొని మొత్తంగా ఇప్పటివరకు మూడు వందలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో పరిస్థితి విషమించడంతో ఒకరిద్దరి మృత్యువాతపడ్డారు. అయితే సంస్థలు మాత్రం తమ సిబ్బందిని కొవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించాలని ఎప్పటికప్పుడు యాప్ ద్వారా అలర్ట్ చేస్తామని పేర్కొంటున్నాయి.

పాజిటివ్ రావడంతో ఇంటికి వచ్చా..

నేను పదో తరగతి వరకే చదువుకున్నా. వేరే ఉద్యోగాలు చేయలేక డెలివరీనే నమ్ముకున్నా. అదే పని చేస్తూ కొవిడ్ బారిన పడ్డాను. పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఇంటి వద్దే క్వారంటైన్ లో ఉంటున్నాను. గతంలో నా మిత్రులు కొంతమందికి వచ్చింది. వారంతా ఇంటికి వెళ్లిపోయారు. నేను కూడా అక్కడే ఉండి ఇబ్బందులు పడలేక మా ఊరికి వచ్చేశా.
– కిరణ్, డెలివరీ బాయ్, మహబూబ్ నగర్ జిల్లావాసి

కొవిడ్ బాధితులకు కూడా ఫుడ్ అందిస్తున్నాం

Rajesh Swiggy

పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారికి కూడా ఫుడ్ డెలివరీలు చేస్తున్నాం. అయితే డెలివరీకి వారి ఇంటికి వెళ్లిన సమయంలో తమకు ముందుగానే ఇంటి గేటు వద్దే పార్సిల్ పెట్టి వెళ్లాలని సూచిస్తున్నారు. అలా చెప్పడం వల్ల అలర్ట్ అయ్యి తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఫుడ్ అందిస్తున్నాం. కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపించినా తప్పడంలేదు.
– రాజేశ్, స్విగ్గీ డెలివరీ బాయ్, అమీర్ పేట

ఇబ్బందులున్నాయి.. కానీ కమిషన్ వస్తోంది

Hanuma

ప్రస్తుతం డెలివరీ చేసే బాయ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. దీనివల్ పని ఒత్తిడి పెరిగింది. అయితే సంస్థలు ఎక్కువ పని చేసినందుకు కమిషన్ అందిస్తున్నాయి. డబ్బులు ఎక్కువగా వస్తాయని చేస్తున్నాం. జొమాటో సంస్థలో సిబ్బందికి పాజిటివ్ గా నిర్ధారణ అయితే క్వారంటైన్ లో ఉన్నన్ని రోజులు ప్రతిరోజుకు రూ.500 అందిస్తున్నారు. ఇది బాధితులకు కొంత ఉపయోగపడుతుంది.
-హనుమ, జొమాటో డెలివరీ బాయ్, హైదరాబాద్


Next Story

Most Viewed