నత్తనడకన కలెక్టరేట్ నిర్మాణం.. నాలుగేళ్లలో కానిది 8 నెలలలో చేస్తారట..

by  |
నత్తనడకన కలెక్టరేట్ నిర్మాణం.. నాలుగేళ్లలో కానిది 8 నెలలలో చేస్తారట..
X

దిశ, భూపాలపల్లి: పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి వాటికి అనుగుణంగా భవనాలు నిర్మించడానికి నిధులు వెచ్చించినా అవి పూర్తి చేయటంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వం భూపాలపల్లి కలెక్టర్ భవనానికి 50 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ ఇంతవరకు పనులు మాత్రం అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే ప్రాంగణంలో ఉండాలనే ప్రభుత్వం కలెక్టర్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టినప్పటికీ అధికారులు చేసే నిర్లక్ష్యం వలన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు కలెక్టరేట్ నిర్మాణానికి 15 కోట్లు ఖర్చు చేసి.. పనులు కేవలం 28 శాతం వరకు పూర్తిచేశారు.

2017 లో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్ నిర్మాణం పనులకు ఆదిలోనే అంతరాయం ఏర్పడింది. కలెక్టర్ భవన నిర్మాణ సమయంలో భూమి సమస్య ఉండటం వలన రెండు సంవత్సరాల పాటు కలెక్టర్ కాంప్లెక్స్ నిర్మాణం ఆగిపోయింది. రెవెన్యూ అధికారులు భూమిని కలెక్టర్ కాంప్లెక్స్ నిర్మాణానికి అప్పగించే ముందు ఎలాంటి వివాదాలు లేని భూమిని ఇవ్వాల్సి ఉండగా.. కోర్టులో ఉన్న భూమిని నిర్మాణానికి అప్పగించడంతో తీవ్ర జాప్యం జరిగింది. 2019 ఏప్రిల్ లో భూ సమస్య తీరడంతో అప్పటినుంచి కలెక్టర్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కలెక్టర్ భవనాన్ని 2022 జూన్ వరకు పూర్తి చేస్తామని ఆర్ అండ్ బి డి రమేష్ తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట లేకపోవడంతో జిల్లాలోని ప్రజలు తమ అవసరాల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కార్యాలయాలన్నీ ఒకేచోట ఉంటే ప్రజల సమస్యలను పరిష్కరించడం సులభంగా ఉంటుంది. కలెక్టరేట్ ఒకచోట,ప్రగతి భవన్ మరోచోట ఉండి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో జిల్లాకు వచ్చిన ప్రజలు పనులకోసం కార్యాలయాలచుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

సమావేశాల నిర్వహణకు సమస్యలు..

జిల్లా కలెక్టర్ నిర్వహించే సమావేశాలు సింగరేణి ఇల్లందు అతిథిగృహంలో నిర్వహించాల్సి వస్తుంది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు సైతం ప్రగతిభవన్ లో లేదా వేరే చోట నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో సమావేశ మందిరాలు సక్రమంగా లేక ప్రజాప్రతినిధులు అధికారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కాటారం ఎంపీపీ సమ్మయ్య, మహదేవ్ పూర్ జడ్పీటీసీ అరుణ ఈ విషయమై జడ్పీ చైర్మన్, స్థానిక శాసనసభ్యులు వెంకట రమణరెడ్డిని ప్రశ్నించారు. వెంటనే స్పందించిన శాసనసభ్యులు కలెక్టరేట్లో వెంటనే సమావేశం మందిరం నిర్మాణం చేపట్టాలని ఆదేశించినప్పటికీ అధికారులు ఆ పనులు చేయడంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

అధికారుల నిర్లక్ష్యం..

నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. 2019 ఏప్రిల్ లో భూవివాదం ముగిసినప్పటికీ, నిర్మాణంలో కాంట్రాక్టర్ పనులు త్వరిత గతిన పూర్తి చేయడం లేదని వాదన ఉంది. 2022 జూన్ వరకు పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ఆ సమయంలోగా పనులు పూర్తయ్యే అవకాశాలు లేవు. నాలుగు సంవత్సరాల్లో 28శాతం పనులు మాత్రమే పూర్తి చేసిన కాంట్రాక్టర్, మరో ఎనిమిది నెలల లోపు పూర్తి పనులు ఎలా చేస్తారని విమర్శలున్నాయి. ఆర్ అండ్ బి అధికారులు స్పందించి కలెక్టరేట్ నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉంది.


Next Story