ధర్నాలు చేస్తున్న మీలో ఏ ఒక్కరైనా ఆ పని చేశారా?.. మంత్రులకు సంపత్ కుమార్ సూటి ప్రశ్న

by  |
sampath-kumar11
X

దిశ, మహబూబ్ నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తూ దోబూచులాడుతున్నాయని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చి రెండుసార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని అన్నారు. రైతులకు చేదోడువాదోడుగా ఉండాల్సిన ప్రభుత్వాలే ధర్నాలకు దిగడం హాస్యాస్పదంగా వుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తే రాత్రికి రాత్రే అరెస్టులు చేసి గృహానిర్బంధం చేస్తారని దుయ్యబట్టారు. దేశంలో రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని.. వారి తరపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతామన్నారు. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. టీఆర్ఎస్ నుంచి ఏ మంత్రి కూడా ఢిల్లీకి వెళ్లి రైతులకు మద్దతుగా ఏ పని చేయడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్, ఎన్పీ వెంకటేశ్, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, బెనహర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story