రసాభాసగా సర్వసభ్య సమావేశం.. అధికారుల పనితీరుపై ఆగ్రహం

by  |
రసాభాసగా సర్వసభ్య సమావేశం.. అధికారుల పనితీరుపై ఆగ్రహం
X

దిశ, భూపాలపల్లి: జిల్లా అధికారుల పనితీరు, వారి నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరుపై అధికార, ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. జిల్లాలో అధికారులు సమస్యల పరిష్కరించడంలో సక్రమంగా స్పందించడం లేదని సభ్యులు అధికారులను పనితీరు ప్రశ్నించారు. ముఖ్యంగా జిల్లాలో మిషన్ భగీరథ పనులు సక్రమంగా జరగడం లేదని విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం జరుగుతుందని, సదరన్ సర్టిఫికేట్లు అర్హులకు కాకుండా అనర్హులకు ఇస్తూ లబ్ధి పొందేలా చేస్తున్నారని జడ్పీటీసీ సభ్యులు పులి తిరుపతి రెడ్డి, గొరికే సదయ్య, జడ్పీటీసీ అరుణ, కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య లు తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా పరిషత్ సమావేశం ప్రగతిభవన్‌లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిని అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి హాజరయ్యారు.

జిల్లా పరిషత్ సమావేశంలో ఇరవై ఎనిమిది అంశాలను చర్చించాల్సి ఉండగా కేవలం ఐదు అంశాలు మాత్రమే చర్చించి సమావేశాన్ని తూతూ మంత్రంగా ముగించారు. జిల్లాలోని కాటారం మండలంలో మల్లెపల్లి గ్రామంలో నాలుగు సంవత్సరాలుగా వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగినప్పటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా చేయకపోవడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. అలాగే మొగుళ్లపల్లి మండలంలో మిషన్ భగీరథ పనులు నాసిరకంగా ఉన్నాయని అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని, విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని జడ్పీటీసీ సభ్యులు పులి తిరుపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేసే అవకాశం ఉందని వాటిని నియంత్రించాలని నెల నెల మాత్రమే ఫీజులు వసూలు చేయాలని అరుణ డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు సంవత్సరం ఫీజు ఒకేసారి వసూలుచేసి, విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

97 జీవో ప్రకారం నెల నెల ఫీజులు వసూలు చేయాల్సి ఉందని డీఈఓ తెలిపారు. అధికారులు సరైన సమాచారంతో సమావేశానికి రాకపోవడం పట్ల సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను అధికారులు సక్రమంగా ప్రజలకు అందేలా చూడాలని, అధికారుల నిర్లక్ష్యం వలన పథకాలు ప్రజలకు చేరలేకపోతున్నాయని, అధికారులు బాధ్యతగా పనిచేయాలని శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి సూచించారు. జిల్లాలో పండ్ల పూల మొక్కల పెంపకం పై రైతులకు అవగాహన కల్పించాలని, దీంతో రైతులు వాటి పెంపకంలో తగు శ్రద్ధ చూపడం లేదని, వెంటనే జిల్లా వ్యవసాయ అధికారులు స్పందించి సరైన మెలకువలు నేర్పించాల్సింది గా కాటారం ఎంపీపీ పంఠకాని సమ్మయ్య అధికారులను కోరారు.

కార్యాలయాలన్ని జిల్లా పరిధిలోని ఉండాలి

ప్రభుత్వ కార్యాలయాలు అన్ని జిల్లా పరిధిలోనే ఉండాలని జిల్లా పరిషత్ సమావేశంలో సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మిషన్ భగీరథ మంచినీటి సరఫరా కార్యాలయాలు కొన్ని పెద్దపల్లి రామగుండం పరిధిలో ఉన్నాయని వాటిని వెంటనే జిల్లాకు మార్పు చేయాల్సిందిగా సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు.

దళిత బంధు అమలు చేయాలి

భూపాలపల్లి జిల్లాలో అధికంగా ఎస్సీ జనాభా ఉన్నందున జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేయాల్సిందిగా జిల్లా పరిషత్ సభ్యులను మండల పరిషత్ సభ్యుల సమావేశంలో డిమాండ్ చేశారు. సభ్యులు పంథకాని సమ్మయ్య, గుడాల అరుణ, లింగమల్ల శారదలు మాట్లాడుతూ జిల్లాలో వెంటనే దళిత బంధు అమలు చేయాలని కోరారు.

పేదలకు అందని వైద్యం

జిల్లా కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి, చిట్యాల, మాదేపూర్ మండల కేంద్రంలో సివిల్ ఆస్పత్రి ఉన్నప్పటికీ ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదని కాటారం పంతకానీ సమ్మయ్య జడ్పీటీసీ అరుణ, ఎంపీపీ మల్హర్ రావు అన్నారు. సమావేశంలో వారు మాట్లాడుతూ.. తాడిచెర్ల గ్రామంలో ఏఏంఆర్ సంస్ధ ద్వారా బొగ్గు ఉత్పత్తికి తీసుకున్న సమయంలో దుమ్ము ధూళితో కార్మికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సంస్థ ఆస్పత్రిని ఏర్పాటు చేసి ఇద్దరు, వైద్యులను ఉంచుతామని హామీ ఇచ్చినప్పటికీ ఆ కార్యక్రమం ఎందుకు అమలు కావడం లేదని ఆయన ప్రశ్నించారు.

భూపాల్‌పల్లిలో సింగరేణి సంస్థ వారు కార్మికులకు మెరుగైన వైద్యం అందిస్తుండగా తాడిచర్లలో మాత్రం ఆ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టడం లేదని ఆయన అధికారులను ప్రశ్నించారు. మహదేవ్‌పూర్ మండల కేంద్రంలో ఆసుపత్రిలో వైద్య నిపుణులు, సరైన డాక్టర్ లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని జడ్పీటీసీ అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి వైద్యులు నియమించాలని కోరారు.

Next Story

Most Viewed