కోదాడ పోలీసులపై సంచలన ఆరోపణలు.. హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

by  |
కోదాడ పోలీసులపై సంచలన ఆరోపణలు.. హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ బెదిరింపులకు గురి చేస్తున్న.. కోదాడ డీఎస్పీ, సీఐ, ఇతర పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను గురువారం ఆశ్రయించాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన నాగరాజప్ప మహేష్ హెచ్ఆర్సీకి చేసిన ఫిర్యాదు ప్రకారం.. తాను కందిబండ గ్రామానికి చెందిన పొన్న సుధాకర్ రెడ్డి వద్ద సర్వే నెంబర్ 180 /ఏ5 లో 1.20 ఎకరాల భూమిని కొనుగోలు చేసి రూ.29 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. అయితే సుధాకర్ రెడ్డి భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేయడంతో.. కోదాడ పోలీస్ స్టేషన్‌లో సీఐ శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేయగా.. రాజీపడమని సూచించారని చెప్పారు. ఇచ్చిన డబ్బులు తీసుకుని కేసు రాజీపడి వెళ్లిపోవాలని సీఐ బెదింరింపులకు పాల్పడ్డారని, దీనికి తాను అంగీకరించకపోవడంతో సుధాకర్ రెడ్డితో కుమ్మక్కై తనపైనే తప్పుడుగా క్రిమినల్ కేసు నమోదు చేశాడన్నారు.

ఈ కేసును అడ్డుపెట్టుకుని తనను ప్రతిరోజు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తిట్టడం, బెదిరించడం వంటివి చేస్తున్నారని ఆరోపించాడు బాధితుడు. అంతేకాకుండా ప్రేమ వివాహం చేసుకున్న తనపై తన అత్తింటి వారితో చంపించేందుకు కుట్ర పన్నారని వాపోయారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి, కోదాడ డీఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా తనపైనే పలు కేసులు పెట్టి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు కోర్టులో విచారణలో ఉండగా గత ఏడాది అక్టోబర్ 13వ తేదీన పోలీసులు ఇంటిపై దాడి చేసి మోటార్ సైకిల్ సీజ్ చేశారని, తన భార్యను బెదిరించి బీరువాలో ఉన్న రూ.43 లక్షలను తీసుకుని కేవలం వాహనాన్ని మాత్రమే కోర్టులో డిపాజిట్ చేశారని వాపోయాడు. వీరితో తనకు ప్రాణహాణి ఉందని, వారి నుండి తనకు రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని నాగరాజప్ప మానవ హక్కుల కమిషన్‌ను వేడుకున్నాడు.

Next Story

Most Viewed