తోకచుక్క కారణంగానే డైనోసార్స్ అంతం?

by  |
తోకచుక్క కారణంగానే డైనోసార్స్ అంతం?
X

దిశ, ఫీచర్స్ : కోట్లాది సంవత్సరాల క్రితమే ‘డైనోసార్లు’ అంతరించిపోయాయన్న విషయం తెలిసిందే. భూమి మీదున్న మూడొంతుల మొక్కలు, జీవులు కూడా ఆ సమయంలోనే చనిపోగా, ఇందుకు కారణం గ్రహశకలమా, తోకచుక్కా? అని ఇంతవరకు ఎవరికీ తెలియదు. అది ఎక్కడ ఉద్భవించింది, భూమిని ఎలా తాకిందన్న విషయం ఇప్పటివరకు ఓ పజిల్‌లా ఉండిపోయింది. తాజాగా ఆ పజిల్‌కు తాము సమాధానం కనుగొన్నామని హార్వర్డ్ పరిశోధకులైన లోబ్, అమీర్ సిరాజ్‌లు చెబుతున్నారు. 66 మిలియన్ల ఏళ్ల క్రితం భూమిపై సంచరించిన డైనోసార్లు అంతరించిపోవడానికి తోకచుక్క గ్రహశకలాలే కారణమంటున్న వారి కొత్త అధ్యయన విశేషాలతో పాటు ప్రయాణ వివరాలు ఇటీవలే ‘సైంటిఫిక్ రిపోర్ట్స్‌’లో ప్రచురితమయ్యాయి.

6.5 కోట్ల ఏళ్ల క్రితం 12 కిలోమీటర్ల వెడల్పుగల ఒక ఉల్క భూమిని ఢీకొనడంతో 75 శాతం జీవరాశులు నశించిపోగా, డైనోసార్లు కూడా అప్పుడే అంతమైపోయాయి. ఆ తర్వాత సుమారు ఏడాదిపాటు సూర్య కిరణాలు సైతం చేరుకోలేనంతగా దుమ్ము, ధూళి భూమిని కప్పేశాయి. దీంతో ఒక సంవత్సరం మొత్తం భూమి చీకట్లోనే ఉండిపోయిందని, తద్వారా ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయని పలు అధ్యయనాలు తెలిపాయి. అయితే ఆ సమయంలో భూమిని ఢీకొట్టింది ఉల్క కాదని, తోక చుక్క అని.. లోబ్-సిరాజ్‌ అధ్యయనం వెల్లడించింది.

సౌర వ్యవస్థ అంచున గల మంచు శిథిలాల ప్రాంతంలో ఉద్భవించిన ఒక తోకచుక్క, భూమిపైకి దూసుకొచ్చేందుకు జూపిటర్(బృహస్పతి) కారణమని, ప్రతి 250 – 750 మిలియన్ సంవత్సరాల మధ్యలో ఇలాంటివి జరుగుతాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. పసిఫిక్ మహాసముద్రంలో ఈ తోకచుక్క పడిపోగా, దాని ప్రభావం 180 కిలోమీటర్ల వరకు వ్యాపించిందని అంచనా వేస్తున్నారు. తోక చుక్క సృష్టించిన వినాశనం.. డైనోసార్ల జీవనానికి అనువైన వాతావరణాన్ని క్షీణించేలా చేసిందని, డైనోసార్లు అంతరించిపోవడానికి అదే కారణమని రీసెర్చర్లు అభిప్రాయపడుతున్నారు. తోకచుక్క ఢీకొన్నప్పుడు ఉద్భవించే వేడి కారణంగానే జంతువులు, మొక్కలు చనిపోయినట్లు తెలిపారు.

Next Story

Most Viewed