వీలైనంత వేగంగా కొనుగోలు పూర్తి చేయండి : కలెక్టర్

by  |
Collector Shruti Ojha
X

దిశ, గద్వాల: ధాన్య కొనుగోలులో ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా, వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రుతి ఓఝా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని 59 కొనుగోలు కేంద్రాల్లో వరి కొనుగోలు నాలుగు రోజులలోపు పూర్తి చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ బ్యాగులను సరఫరా చేయడానికి ఎన్ని అవసరమో రిపోర్ట్ చేయాలన్నారు. అదనపు లేబర్‌ను ఏర్పాటు చేసుకుని కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. రైతులకు ఎప్పటికప్పుడు డబ్బులు అకౌంట్లలో జమ అయ్యేలా చూడాలన్నారు.

కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులకు వరి ధాన్యం టోకెన్లు అందజేయాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్లు విజిట్ చేసి వరిధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. వెబ్ సైట్‌లో నమోదు కార్యక్రమాన్ని వేగంగా చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ, ఆర్డీవో రాములు, డీఎస్‌ఓ రేవతి, వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, డీఆర్‌డీఏ ఉమాదేవి, వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


Next Story