MRO ఆఫీసులో వసూళ్ల దందా.. ప్రతి పనికీ రేటు ఫిక్స్

by  |
MRO ఆఫీసులో వసూళ్ల దందా.. ప్రతి పనికీ రేటు ఫిక్స్
X

దిశ, ములకలపల్లి : ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మారడం లేదు. డబ్బులు ఇస్తే కానీ కార్యాలయాల్లో పనులు జరగడం లేదు. ప్రతీ పనికి ఒక రేటు కట్టి ఆ డబ్బు ముట్టేవరకు బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఏళ్ల తరబడి తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతికి ప్రస్తుతం ఫుల్ స్టాప్ పడ్డట్లు అయింది.

ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఏసీబీ దాడుల్లో జూనియర్ అసిస్టెంట్ రవీందర్ కుమార్ లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనం కలిగించింది. కొంతకాలంగా రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న అవినీతికి ఈ ఘటన అద్దం పడుతోంది. ఈ కార్యాలయంలో పనిచేసిన కొందరు ఉద్యోగుల పనితీరు, వారు పాల్పడ్డ అవినీతి పతాక శీర్షికలై ప్రతినిత్యం విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ ఏసీబీ దాడుల పరంపరతోనైనా కార్యాలయ అధికారుల్లో మార్పు వస్తుందని జనంలో చర్చ జరుగుతున్నది. ఈ కార్యాలయంలో ఇంకా కొందరు అవినీతి అధికారులు ఉన్నారని వారు నిజాయితీగా పనులు చేయకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

క్రింది స్థాయి ఉద్యోగులే పావులు..

ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు వారి క్రింది పనిచేసే చిన్న ఉద్యోగులను బలి చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ దగ్గరకు వచ్చే కుల, ఆదాయ ధృవీకరణతో పాటు ఏ పని కోసం వెళ్లినా ప్రతీ పనికి ఒక రేటు చెప్పి వారి క్రింది ఉద్యోగుల ద్వారా డబ్బులు వసూలుకు పాల్పడుతున్నట్లు సమాచారం. భూముల బదలాయింపు, హక్కు పత్రాల విషయంలో చట్టానికి వ్యతిరేకంగా పనులు చేసి స్థానికుల దగ్గర లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడిన ఘటనలు మండలంలో కోకొల్లలు ఉన్నాయి.

కాసులు కురిపిస్తున్న మట్టి తోలకాలు..

మండలంలో మట్టి, ఇసుక తోలకాలు రెవెన్యూ శాఖలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులకు కాసులు కురిపిస్తున్నాయి. ట్రాక్టర్‌కి ఒక రేటు కేటాయించి డబ్బులు వసూల్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా అధికారులకు డబ్బులు చెల్లింపులు చేస్తేనే ట్రాక్టర్ రోడ్డెక్కుతుంది. డబ్బులు వసూలు కోసం వీళ్ళు ప్రత్యేకంగా ఒక వ్యవస్థను గ్రామాల్లో ఏర్పాటుచేసుకున్నారు.

క్యాష్ లేకపోతే గూగుల్ పే, ఫోన్ పే ద్వారా వారి క్రింది స్థాయి ఉద్యోగుల ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చెపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎవరైనా మండలంలో కొత్తగా ఇండ్ల నిర్మాణం చేపట్టాలి అంటే ఆ అధికారులను ప్రసన్నం చేసుకున్నాకే పనులు మొదలు పెట్టాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్డింగ్ నిర్మించుకోవాలంటే ఒక్కో పిల్లర్‌కు రూ. 5 వేలు డిమాండ్ చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న అధికారుల అవినీతి మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా జనం సొమ్ము జలగళ్లా పీల్చుతున్న అధికారులకు ఈ ఏసీబీ దాడులు కనువిప్పుగా మారుతాయని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed