Mamata Banerjee: క్షమించండి.. మోడీ కాళ్లు పట్టుకోడానికైనా రెడీ : మమతా బెనర్జీ

by  |
Mamata Banerjee: క్షమించండి.. మోడీ కాళ్లు పట్టుకోడానికైనా రెడీ : మమతా బెనర్జీ
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో విరుచుకుపడ్డ యాస్ సైక్లోన్ నష్టంపై ప్రధాని సమీక్షా సమావేశానికి డుమ్మా కొట్టారన్న విమర్శలపై సీఎం మమతా బెనర్జీ శనివారం కౌంటర్ ఇచ్చారు. పక్షపాత, తప్పుడు వార్తలతో ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) తనను అవమానించిందని, ఏకపక్ష ట్వీట్లతో తన ప్రతిష్టను దెబ్బతీసిందని ఎదురుదాడికి దిగారు. తనపై వచ్చిన విమర్శలకు సమాధానమివ్వడానికి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘నన్ను ఇలా అవమానపరచవద్దు. అసెంబ్లీ ఎన్నికల్లో మేం అఖండ విజయాన్ని నమోదుచేశాం. అందుకే మాతో మీరిలా వ్యవహరిస్తున్నారా? మీరు శాయశక్తులా ప్రయత్నించి ఓడిపోయారు. మాతో ఎందుకు రోజూ పోట్లాడుతున్నారు?’ అని పేర్కొంటూ శుక్రవారం జరిగిన విషయాలను స్పష్టంగా వివరిస్తానని అన్నారు.

తనకోసం ప్రధానమంత్రి ఎదురుచూడటం కాదని, తానే 20 నిమిషాలు సమావేశమవడానికి వెయిట్ చేయాల్సి వచ్చిందని దీదీ అన్నారు. ‘తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు నా ప్రణాళికలన్ని సిద్ధం చేసుకున్నాను. ఇంతలో పీఎం బెంగాల్ సందర్శించనున్నట్టు సమాచారమందింది. పీఎం-సీఎం మీటింగ్ జరిగే స్థలానికి వెళ్లగా, అప్పటికే ప్రధాని వచ్చారని, సమావేశం మొదలైందని మమ్మల్ని లోనికి రానివ్వలేదు. గంటసేపు బయటే ఉండాలని ఆదేశించారు. అప్పుడే ఆ భేటీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరుగుతున్నట్టు తెలిసింది. వెంటనే నేను, సీఎస్ అక్కడికి వెళ్లాం. ప్రధానితో గవర్నర్, కేంద్ర ప్రభుత్వ నేతలు, విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు భేటీలో ఉన్నారు. నిజానికి ఇది పీఎం-సీఎం మీటింగ్. ఇందులో వారందరికీ చోటులేదు. దీంతో తుపాను నష్టంపై రిపోర్టును ప్రధానికి అందజేసి దిఘాలో నష్టాలను పరిశీలనకు వెళ్లడానికి పీఎంను పర్మిషన్ అడిగాను. మూడు సార్లు అనుమతి కోరాను’ అని వివరించారు. గుజరాత్, ఒడిశాలో పీఎం భేటీలో సీఎంలే ఉన్నారని, ప్రతిపక్ష నేతల్లేరని ఉటంకిస్తూ బెంగాల్‌లో పీఎం రివ్యూ మీటింగ్ కేవలం పొలిటికల్ సెటిల్‌మెంట్ కోసమేనని ఆరోపించారు.

పాదాలకు నమస్కరిస్తేనే పీఎం ఈగో సంతృప్తి చెందుతుందంటే, బెంగాల్ ప్రజల సంక్షేమం కోసం దానికీ సిద్ధమేనని మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బదిలీ ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని, దేశవ్యాప్త బ్యూరోక్రాట్లకు ఈ తరహా ఆదేశాలు అవమానకరమని పేర్కొన్నారు. స్వతంత్ర భారతంలో ఇలాంటి ఉదంతాలు ఎప్పుడైనా జరిగాయా? అని ప్రశ్నించారు.


Next Story

Most Viewed