మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం : కేసీఆర్

by  |
మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం : కేసీఆర్
X

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో దేశవ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎలా మారిపోయినా తెలంగాణలో మాత్రం సజీవంగా ఉంచుతూ మరింత బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినందున వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత, వాటి సమన్వయం పెరిగిందని, ఈ రెండు శాఖల పనితీరులో గుణాత్మక మార్పురావాలని కోరారు. పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు పెంపొందాలని, ఇందుకు వ్యవసాయ శాఖ గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో ప్రగతిభవన్‌లో ఆయన ఆదివారం సుమారు ఎనిమిది గంటల పాటు సమీక్ష నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పది రోజులలో రాష్ట్రంలోని ఏ గుంటలో ఏ పంట వేసారో అధికారులు సరైన లెక్కలు తీయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతులకు ఇబ్బంది లేకుండా మార్కెట్ యార్డులలో పంటలను అమ్ముకోడానికి పటిష్టమైన విధానాన్ని రూపొందించాలని సూచించారు. ముందుగానే టోకెన్లు జారీ చేసి ఏ రోజున ఏ మార్కెట్‌కు వెళ్ళాలో తెలియజేయాలన్నారు. కొత్తగా నిర్మించిన రైతు వేదికలను వెంటనే వాడుకలోకి తేవాలని, రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ శాఖ కాగితం-కలం శాఖగా కాకుండా పొలం-హలం శాఖగా మారాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన పంటలను మార్కెట్‌లో అమ్ముకునేందుకు సరైన పద్ధతులు అవలంబించే బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉందన్నారు. ఏఈఓ రైతు బంధు సమితి కార్యాలయాలు కూడా రైతువేదికలోనే భాగంగా ఉండాలని, ఇందుకవసరమైన వసతులు సమకూరాలన్నారు. గతంలో మనం అమెరికా, చైనా, రష్యా, జపాన్, ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో ఇలా జరిగింది… అలా జరిగింది… అంటూ విజయ గాథలను చెప్పుకునేవారమని, ఇప్పుడు ఆ అవసరం లేదని, తెలంగాణ రాష్ట్రమే గతంలో కనీవినీ ఎరుగని అనేక అద్భుత విజయాలను సాధించిందని కేసీఆర్ గుర్తుచేశారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏడాదికి 35 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండేదని, ఇప్పుడు 1.10 కోట్ల టన్నులు పండుతోందని సీఎం అన్నారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులతో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. బోర్ల ద్వారా మరో 40 లక్షల ఎకరాలు సాగవుతోందని అన్నారు. ఏడాదికి నాలుగు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసుకునే వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. ఈ పరిస్థితులలో వ్యవసాయ శాఖ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయాధికారులు రైతులకు అండగా నిలవాలన్నారు. పంట మార్పిడి విధానం రావాలని, దీంతో ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయన్నారు. కూలీల కొరతను అధిగమించేందుకు యాంత్రీకరణ పెరగాల్సి ఉందని, పంటల సాగు విధానంలో ఆధునిక పద్ధతులు కూడా రావాలన్నారు. రైతువేదికలను వెంటనే వినియోగంలోకి తేవాలని, రైతులతో తరచూ సమావేశాలు నిర్వహించాలన్నారు. పంటల సాగు, పంటల మార్పిడి, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై చర్చల తర్వాత నిర్ణయం జరగాలన్నారు.

‘‘రైతు వేదికలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయాలి. ఏఈఓ పోస్టు ఖాళీ అయినా, దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళినా తాత్కాలిక పద్ధతిలో మరొకరిని నియమించాలి. రైతులు పంటను అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్లను కొనసాగించాలి. పద్ధతి ప్రకారం పంటలు అమ్ముకునే విధానం ఉండాలి. ముందుగానే టోకెన్లు జారీ చేసి తెలియజేయాలి. ఏ పంటకు ఎక్కడ మంచి ధర ఉందనే విషయంలో ఎప్పటికప్పుడు సూచనలు చేయాలి. ఇందుకోసం మార్కెటింగ్ శాఖలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్‌ను ఏర్పాటు చేయాలి. మార్కెటింగ్ శాఖను బలోపేతం చేసుకోవాలి. కొత్త చట్టాల అమలుతో మార్కెట్ సెస్ రాకున్నా ప్రభుత్వమే నిధులను సమకూర్చి బలోపేతం చేస్తుంది” అని సీఎం పేర్కొన్నారు. మార్కెట్లకు ఎంత ధాన్యం వస్తున్నది, వ్యాపారులకు కొనుగోలు శక్తి ఏ మేరకు ఉన్నది తదితర వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ‘వెద’ వరి సాగుతో ఎకరానికి 10 వేల రూపాయల మేర ఆదా అవుతుంది. పత్తిలో సింగిల్ పిక్ పద్ధతి వచ్చినట్లే ఇంకా ఇతర పంటల్లో వచ్చిన కొత్త వంగడాలు, కొత్త పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలి. మండల వ్యవసాయాధికారులను ఆగ్రోనామిస్టులుగా మార్చడానికి నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. ఆధునిక సాగు పద్ధతులను అధ్యయనం చేయడానికి ఇజ్రాయిల్‌లో పర్యటించాలి. పప్పుదినుసులు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలి. పప్పులు, నూనె గింజలు పండించే ప్రాంతాల్లో దాల్ మిల్లులు, ఆయిల్ మిల్లులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం స్ట్రాటజిక్ పాయింట్లను గుర్తించాలి. వ్యవసాయ పనిముట్లు రైతులకు కిరాయి పద్ధతిలో దొరికేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. మార్కెట్లలో ట్రేడింగ్ లైసెన్స్ ఇచ్చే విషయంలో సులభతరమైన విధానాలను తీసుకురావాలి అని వివరించారు.

ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఎంపీ కేశవరావు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, మార్క్‌ఫెడ్ ఛైర్మన్ మారం గంగారెడ్డి, సీఎంవో అధికారులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కమీషనర్ అనిల్ కుమార్, డైరక్టర్ లక్ష్మీబాయి, సీడ్స్ కార్పోరేషన్ ఎండి కేశవులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed