ఏం చేద్దాం.. బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ కసరత్తు!

by  |
ఏం చేద్దాం.. బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ కసరత్తు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఏ మేరకు నిధులు సమకూరనున్నాయి, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఎంత రానుంది అనే విషయాలను సీఎం కేసీఆర్​ అధికారుల నుంచి అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను మార్చిలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కూర్పుపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులతో సీఎం గురువారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కరోనా కారణంగా భారీ స్థాయిలో ఆర్థిక వనరులు తగ్గినందున బడ్జెట్ ఏ తరహాలో ఉండాలి అనే విషయమై చర్చించినట్లు తెలిసింది. 14వ ఆర్థిక సంఘం కంటే 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ద్వారా రాష్ట్రానికి ఏటా సగటున దాదాపు రెండున్నర వేల కోట్లు నిధులు తగ్గనున్నట్లు ఇప్పటికే ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. పైగా, కేంద్ర బడ్జెట్‌లో రాష్ర్టానికి ఎక్కువగా నిధులు వచ్చే అవకాశమూ లేకపోవడంతో స్వీయ వనరులను ఎలా పెంచుకోవాలనే దానిపైనే సీఎం చర్చించినట్టు తెలిసింది.

కాపిటల్ ఖర్చులపై ఆంక్షలు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 1.82 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించిన ప్రభుత్వం రానున్న ఆర్థిక సంవత్సరానికి ఏ స్థాయిలో ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. నవంబరులో కేసీఆర్ సమీక్ష సందర్భంగా కరోనా కారణంగా రాష్ట్రానికి సుమారు రూ.52 వేల కోట్ల మేర ఆదాయం తగ్గిపోయినట్లు పేర్కొన్నారు. ‘అన్​లాక్’తో ఆదాయం కొంత పెరగడంతో సవరించిన బడ్జెట్ అంచనాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. పలు ప్రాజెక్టులకు కావాల్సిన నిధులపై కూడా చర్చించినట్లు సమాచారం.

పరిమిత ఆర్థిక వనరులున్న ప్రస్తుత తరుణంలో సంక్షేమ పథకాలు, అమలుకు నోచుకోని హామీలు, సాగునీటి ప్రాజెక్టులకు చేయాల్సిన ఖర్చులపై కోత పెట్టడమో, లేదంటే ఆర్థిక వనరుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడమో చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే గతంతో సీఎం కేసీఆర్​ ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచక తప్పదన్న వ్యాఖ్యలు ముందుముందు నిజమయ్యే అవకాశాలున్నాయి. ఇంకా, రిజిస్ట్రేషన్ ధరల సవరణ, స్టాంపు డ్యూటీ పెంపు వంటివి కూడా రానున్న ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన అవసరం ఉండొచ్చు. మొత్తంగా కొత్త బడ్జెట్ ఎలా ఉండనుంది, గతేడాదితో పోల్చితే మెరుగ్గా ఉంటుందా అనే విషయాలపై సీఎం చర్చించినా వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.

Next Story

Most Viewed