గుడికాడ చెప్పుల దొంగ కేసీఆర్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

by  |
గుడికాడ చెప్పుల దొంగ కేసీఆర్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
X

దిశ, చేవెళ్ల : దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో నిరసన తెలుపుతూ ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. శనివారం చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసిన అనంతరం ఆయన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కుమ్మేర, మల్కాపూర్ మీదగా చేవెళ్ల చేరుకుని మండల కేంద్రంలోఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరల అక్కడి నుంచి మండల కేంద్రంలోని షాబాద్ చౌరస్తాలో ఉన్న వైస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి, ఇందిరా గాంధీ విగ్రహలకు పూలమాలలు వేశారు. పాదయాత్ర ముగింపు సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో నిత్యావసర సరుకుల ధరల పెంపునకు నిరసన పాదయాత్ర చేపట్టామన్నారు. చేవెళ్ల కాంగ్రెస్‌కు కంచు కోట అని.. ఇక్కడి నుంచే వైస్ హయాంలో పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడు కూడా చేవెళ్ల నుంచి పాదయాత్ర చేపట్టాము. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ చెరువుకు గండిపడిందన్నారు. టీఆర్ఎస్‌కు ఇక చేవెళ్ల బస్టాండే గతి అని అన్నారు.

ఎనిమిదేళ్లుగా దేశంలో మోడీ, రాష్ట్రంలో కెసీఆర్ పాలన సాగిస్తున్నారని.. 2014లో 60 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఉంటే.. ఇప్పుడు 108 అయ్యిందన్నారు. కాంగ్రెస్ హయాంలో చేతిలో డబ్బులు ఉంటే సంచి నిండా సరుకులు వచ్చేవి. ఇప్పుడు సంచిలో డబ్బు తీసుకుని పోతే చేతిలో సరుకులు వస్తున్నాయన్నారు. మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చారు. అంటే ఇప్పటి వరకు 14 కోట్ల ఉద్యోగాలు రావాలి. రూ. 30 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయన్నారు. పండించిన పంటలకు మద్దతు ధరలు లేవు.అమ్మబోతే అడవి, కోనపోతే కొరివి అయ్యిందన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ కాళేశ్వరం కట్టినా అంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ చేస్తే చేవెళ్లను తొలగించి ఇక్కడ రైతులకు అన్యాయం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ మారిన వాళ్ళు అభివృద్ధి కోసం పార్టీ మారామని అంటున్నారు. కానీ చేవెళ్లలో ఎక్కడ ఉంది అభివృద్ధి అని ప్రశ్నించారు. ఢిల్లీలో అగ్గి పుట్టిస్తా అన్న కేసీఆర్.. ఫామ్ హౌస్‌లో పెగ్గేసే అన్నారు. ఇక మన ఎంపీ అయితే పార్లమెంట్‌లో వరి ధాన్యం కొనుగోలు పై మాట్లాడాల్సింది పోయి పళ్ళు ఇగిలించుకుంటూ బయటకు వస్తున్నాడు. పళ్ళు ఇగిలించే ఎంపీ చేవెళ్లను ఏమి అభివృద్ధి చేస్తాడని విమర్శించాడు.

రైతుల వడ్లను ప్రభుత్వం కొనే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే రాంమోహన్, డీసీసీ అధ్యక్షులు చల్ల నరసింహ రెడ్డి, పీసీసీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, ఆల్ ఇండియా యాత్ కాంగ్రెస్ నేషనల్ నాయకుడు అంజన్ యాదవ్, రాష్ట్ర యాత్ అధ్యక్షులు శివాశేనా రెడ్డి, పంచాయతీ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు చింపుల సత్యనారాయణరెడ్డి, మాజీ పీసీసీ అధికార ప్రతినిధి పామేనా భీం భారత్, చేవెళ్ల సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి, పార్టీ ఐదు మండలాల అధ్యక్షులు, యాత్ నియోజకవర్గం అధ్యక్షులు పెంటారెడ్డి, నియోజకవర్గం సీనియర్ నాయకులు సున్నపు వసంతం, టీపీపీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మాజీ యాత్ అధ్యక్షులు యాలాల మహేశ్వర్ రెడ్డి, యాత్ మండల్ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్, దేవర వెంకట్ రెడ్డి, ఆగిరెడ్డి, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed