265 గ్రామాల్లో పాఠశాలల్లేవ్.. ఓపెన్ చేసేందుకు సర్కారు కసరత్తు

by Rajesh |
265 గ్రామాల్లో పాఠశాలల్లేవ్.. ఓపెన్ చేసేందుకు సర్కారు కసరత్తు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 265 గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేవని విద్యాశాఖ అధికారులు లెక్కల ద్వారా తేలింది. పిల్లలు లేరనే కారణంతో గత ప్రభుత్వ హయాంలో మూతపడ్డ పాఠశాలలే ఇందులో ఎక్కువగా ఉన్నాయి. వీటిలో మెజార్టీ స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో నూతన పాఠశాలలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ప్రతీ గ్రామ పంచాయతీలో తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండాలన్న సీఎం నిర్ణయం మేరకు ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఈ మేరకు అధికారులు రాష్ట్రంలో మూతపడ్డ పాఠశాలల వివరాలు సేకరించడంతో నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగానే డిసెంబరులో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా నూతన పాఠశాలల ఏర్పాటుపై వివరాలు సేకరించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం విధితమే. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువు కోసం ఇతర గ్రామాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో గత నాలుగు నెలలుగా విద్యాశాఖ అధికారులు మూసివేసిన పాఠశాలల పునరుద్ధరణకు కసరత్తులు చేస్తున్నారు.

పాఠశాలలు లేని గ్రామాలు 265

రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా, 265 గ్రామపంచాయతీల్లో పాఠశాలలు లేవని తేలింది. వీటిలో 206 గ్రామ పంచాయతీల్లో స్కూళ్లు అవసరమని అధికారులు గుర్తించారు. మరో 62 గ్రామాల్లో పిల్లలు లేకపోవడంతో స్కూళ్ల ఏర్పాటు అవసరం లేదని సర్కారుకు నివేదిక అందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పిల్లలు లేరనే కారణంతో పాఠశాలలను మూసివేస్తే.. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించేందుకు మొగ్గుచూపడంపై పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే, మూతపడ్డ స్కూళ్లనూ రీఓపెన్ చేయించేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోంది.

నల్లగొండలో అత్యధిక స్కూళ్లు..

రాష్టంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 24 కొత్త స్కూళ్లను ప్రారంభించనున్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాదాద్రి భువనగిరి జిల్లాలో 21 చొప్పున, వరంగల్‌‌‌‌‌‌‌‌లో 16 కొత్త స్కూళ్లను ప్రారంభించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 14 పంచాయతీల్లో స్కూళ్లు లేవని, ఇందులో 11 గ్రామపంచాయతీల్లో కొత్త స్కూళ్లు అవసరం లేదని అధికారులు గుర్తించారు. వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 24 జీపీల్లో స్కూళ్లు అందుబాటులో లేకపోగా, ఇందులో 12 గ్రామపంచాయతీల్లో అసలు కొత్త స్కూళ్లే అవసరం లేదని వెల్లడించారు.

హైదరాబాద్, గద్వాల, మేడ్చల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలు మినహా ప్రతి జిల్లాలోనూ ఒకటి ఆపై స్కూళ్లు మూతపడ్డాయి. గ్రామాల్లో కొత్త స్కూళ్లను ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూన్‌‌‌‌‌‌‌‌లో జరిగే బడిబాటలో భాగంగా ఆయా గ్రామ పంచాయతీల్లో పిల్లలను గుర్తించి, వారికి స్కూళ్లలో అడ్మిషన్లు ఇప్పించాలని భావిస్తున్నారు. అందుబాటులో ఉన్న టీచర్లనే కొత్త స్కూళ్లలో సర్దుబాటు చేయాలని యోచిస్తున్నారు.

విద్యా శాఖపై సీఎం నిర్వహించిన సమీక్షలో భాగంగా గ్రామంలో పాఠశాల ఉండాలనే నిర్ణయంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పుడు వివరాలు సేకరిస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఎక్కడ పాఠశాల అవసరం? పిల్లల ఎన్ రోల్ తక్కువగా ఉండి.. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండి ఆ గ్రామానికి దగ్గరగా ఉంటే సదరు పాఠశాలలో ఆ ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేసేలాగా కసరత్తు చేస్తున్నాం. ప్రస్తుతం 1748 పాఠశాలల్లో జీరో ఎన్ రోల్ వుంది.

- లింగయ్య ,అదనపు సంచాలకులు ,పాఠశాల విద్య శాఖ ,హైదరాబాద్

విద్యపై ప్రభుత్వ శ్రద్ధకు హర్షం..

రాష్ట్రంలోని ప్రతి తండా, గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండేలా చర్యలు తీసుకోవడం విద్యావ్యవస్థపై ప్రభుత్వం కనబరుస్తున్న శ్రద్ధకు నిదర్శనం. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా విద్యా హక్కు చట్టం ప్రకారం తీసుకోవాల్సిన ఇతర చర్యలు కూడా వెంటనే అమలయ్యేలా చూడాలి. ఎన్నేళ్ల నుంచో ఉన్న ఇతర ఉపాధ్యాయ సమస్యలను కూడా శీఘ్రంగా పరిష్కరించాలి.

-చింతకుంట జగదీశ్, రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్

Advertisement

Next Story