రైతన్నలు.. జర పైలం..! జోరుగా నకిలీ విత్తనాల చెలామణి

by Shiva |
రైతన్నలు.. జర పైలం..! జోరుగా నకిలీ విత్తనాల చెలామణి
X

దిశ, బొంరాస్‌పేట్: వానలు కురుస్తుండడంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఒకటే ఆశ.. పంట దిగుబడి బాగా ఉండాలనుకుంటారు. దీనికి గాను రైతులు జర జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే తేరుకోలేని నష్టాన్ని చవి చూడవలసి వస్తుందని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు. ఏది మంచిదో, ఏది నకిలీదో అర్థం కాని విధంగా విత్తనాల ప్యాకెట్స్ ఉంటున్నాయని పేర్కొంటున్నారు. విత్తనాల బెడద రైతులకు సవాల్‌గా మారింది. కొందరు కేటుగాళ్ల కారణంగా ఆరుగాలం శ్రమించి అరక దున్ని విత్తనాలు వేసిన అన్నదాతలకు అగచాట్లు తప్పడం లేదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనాలని వ్యవసాయాధికారులు చూపిస్తున్నారు. అంతేకాదు అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ఆచరించినప్పుడే సాగులో సంపూర్ణ విజయం సాధ్యమవుతుంది. అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడులు సొంతం చేసుకోవచ్చు. వానకాలం సీజన్ ప్రారంభంలోనే రైతులు అప్రమత్తంగా ఉండి సాగు మొదలు పెట్టాలి. ఏదో ఒక విత్తనాలు కొని, ఇచ్చి పచ్చి దుక్కిలో వేసుకుంటే అవి మొలకలు రాక అదును దాటిపోయి ఆ ఏడాది వ్యవసాయమే ప్రశ్నార్థకం కావచ్చు. అందుకే అన్నదాతలు వ్యవసాయ పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు.

మాయ మాటలను నమ్మొద్దు..

వర్షాలు కురిస్తే చాలు రైతుల్లో హడావిడి మొదలవుతుంది. రోహిణి కార్తెలో విత్తనాల కోసం రైతులు డీలర్ల దుకాణాల వద్దకు పరుగులు పెడతారు. పలు విత్తన కంపెనీలు డీలర్లకు ఆఫర్లు ప్రకటిస్తాయి. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. ఫొటోలు చూపించి ఆఫర్ల ఆశ చూపి వివిధ పట్టణాలకు కంపెనీవారు రైతులను తీసుకుపోవడం, గ్రామాల్లో తిరుగుతూ విత్తన ప్యాకెట్లు బుక్ చేసుకోవడం చేస్తుంటారు. వాటికి దూరంగా ఉండడం మంచిదని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

రైతన్నలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • గ్రామంలో కానీ, మండలంలో కానీ ప్రభుత్వ అనుమతులు ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి.
  • రైతులు కొనే విత్తనాలకు సంబంధించిన రసీదు(బిల్లు)ను దుకాణదారు నుంచి తప్పనిసరిగా తీసుకొని భద్రపరుచుకోవాలి.
  • పంట దిగుబడి వచ్చే వరకు, పంట కాలం అయిపోయే వరకు బిల్లు రైతు దగ్గరనే భద్రపరుచుకోవాలి.
  • తీసుకున్న బిల్లు మీద విత్తన కంపెనీ పేరు, విత్తన రకం, బ్యాచ్ నంబర్, లాట్ నంబర్ ధర ఉండాలి.
  • విత్తన ప్యాకెట్ మీద తయారైన తేదీ, కాలం ముగిసిన (గడువు) తేదీలు సరిగా ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి.
  • విత్తన సంచులు చిరిగినా, రంధ్రాలు ఉన్నా, తడిసినా కొనుగోలు చేయొద్దు. విత్తన ప్యాకెట్లు నిల్వ ఉంచినప్పుడు తేమశాతం చూసుకోవాలి.
  • బిల్లులపై దుకాణం ముద్ర ఉండేలా చూడాలి.

సమాచారం ఇవ్వండి..

గ్రామాల్లో తక్కువ ధరకు, ఎక్కువ ధరకు అమ్మే వారి వివరాలు మీకు అందుబాటులో ఉన్న వ్యవసాయ అధికారికి సమాచారం ఇవ్వాలి. పక్క జిల్లా, రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఎవరైనా నకిలీ విత్తనాలు, లూజ్ విత్తనాలు అమ్మినచో సమాచారం ఇవ్వాలి. తొందరపడి లైసెన్స్ డీలర్ దగ్గర కాకుండా, ఇతరుల దగ్గర విత్తనాలు తీసుకొని ఇబ్బంది పడకూడదు.

- అనురాధ, బొంరాస్ పేట్ వ్యవసాయాధికారిణి

Next Story