కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్.. ఈటలకు బిగ్ షాక్

by  |

దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ రాజకీయ వ్యూహాలను పరిశీలించే చాలా మంది అనుభవజ్ఞులే ఆయనను ’చాణక్యుడు’ అంటూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇప్పుడు హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగడానికి ముందు కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి ప్రధానితో భేటీ అయ్యి ఈటల రాజేందర్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. రాజకీయంగా కోలుకోలేకుండా ఉచ్చులో పడేశారు. పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది గానీ హుజూరాబాద్ విషయంలో మాత్రం పండగల తర్వాత చూద్దామంటూ వాయిదా వేసింది. కనీసం ఊహకు కూడా అందకుండా ఈటల రాజేందర్‌కు కేసీఆర్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.

ప్రధానితో భేటీ అయిన గంటల వ్యవధిలోనే ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రకటన రావడం అనూహ్య పరిణామం. ‘హుజూరాబాద్ హీరో నేనే. కేసీఆర్ హరీశ్‌‌రావు పోటీ చేసినా ఓటమి తప్పదు’ అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించిన ఈటల ఇప్పుడు మూడు నెలల దాకా పరిస్థితిని తనకు అనుకూలంగా ఉంచుకోవడం అంత ఈజీ కాదు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ప్రధానితో భేటీ ఒక్కసారిగా ఈటల వర్గీయులకు చెమటలు పట్టించింది.

ఇప్పటివరకూ ఎన్నికల ప్రచారం ఊరూ వాడా కలియదిరుగుతున్న ఈటల రాజేందర్ ఇకపైన ఎలా తన కార్యాచరణను షెడ్యూలు చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. పండగలు పూర్తయ్యేంత వరకు ఎన్నిక ఉండదని ఎలక్షన్ కమిషన్ చెప్పేయడంతో దీపావళి పండుగ వరకూ షెడ్యూలు విడుదలయ్యే అవకాశం లేదు. నవంబరు 4వ తేదీన దీపావళి పండుగ దాకా ఉప ఎన్నిక అనుమానమే. అప్పటివరకూ నియోజకవర్గంలో ప్రచారాన్ని కొనసాగించడం ఈటల రాజేందర్‌కు కత్తిమీద సామే.

ప్రచారం కోసం రోజూ లక్షలాది రూపాయలను ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో కనీసంగా మూడు నెలల పాటు కార్యకర్తల అవసరాలు, ఎన్నికల ప్రచారానికి అయ్యే ఖర్చును భరించడం ఈటలకు సవాలుగా మారింది. ఇప్పటివరకూ ప్రజలను, కేడర్‌ను ఎలాగో తన నుంచి దూరం కాకుండా చూసుకోగలిగిన ఈటల ఇకపైన అసలైన సవాలును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ చేసిన ఖర్చు వృథా కావడంతో పాటు రానున్న మూడు, నాలుగు నెలల పాటు ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడం ఆయనకు ఒక ముళ్ళబాటే.

ప్రధానితో కేసీఆర్ భేటీ అయ్యి స్నేహం ఉందనే సంకేతాన్ని ఇవ్వడంతో బీజేపీ శ్రేణులు డీలా పడ్డాయి. ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ఇప్పుడు ముందుకు వెళ్ళలేక, ఖాళీగా ఉండలేక చిక్కుల్లో పడ్డారు. ఇప్పటివరకూ ఎలా వ్యవహరించినా ఇకపైన ఆయన ఏ విధంగా ఈ అనుకూల పరిస్థితిని కంటిన్యూ చేసుకోగలుగుతారనేది కీలకంగా మారింది. పేరుకు బీజేపీ అభ్యర్థి అయినా అన్నీ తానై ఒంటరి పోరాటం చేస్తున్న ఈటల రాజేందర్ ఇకపైన కేసీఆర్, మోడీ దోస్తీ, తాజా మీటింగ్ తర్వాత ఎలా సర్దుకుంటారన్నది కూడా ప్రధానాంశంగా మారింది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed