ప్రతి సింగరేణి కార్మికునికి లక్షా 15 వేలు.. షరతులేంటంటే ?

by  |
ప్రతి సింగరేణి కార్మికునికి లక్షా 15 వేలు.. షరతులేంటంటే ?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు ప్రకటించిన 29 శాతం లాభాల బోనస్‌ సొమ్మును ఈ నెల (అక్టోబర్‌) 11వ తేదీన చెల్లిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్‌, ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి ఉద్యోగుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 29 శాతం లాభాలు బోనస్‌ కింద కంపెనీ 79.07 కోట్ల రూపాయలను కార్మికులకు పంపిణీ చేస్తుందని తెలిపారు. అలాగే ఇటీవల ప్రకటించిన దీపావళి బోనస్‌ (ప్రొడక్షన్‌ లింక్‌డ్‌ రివార్డ్‌ బోనస్‌) ను నవంబర్‌ 1వ తేదీన కార్మికుల ఖాతాల్లో జమచేస్తున్నట్లు తెలిపారు. ఈ బోనస్‌ చెల్లింపు కోసం సంస్థ 300 కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని, ఈ బోనస్‌ కింద ప్రతీ కార్మికుడు 72,500 రూపాయలను అందుకోనున్నాడని తెలిపారు. రెండు బోనస్‌ల చెల్లింపుకు సింగరేణి 379.07 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు.

కాగా సింగరేణి సంస్థ పండుగ అడ్వాన్స్‌ కింద ప్రతి కార్మికుడికి 25 వేల రూపాయలను ప్రకటించిందని, ఈ డబ్బును ఈ నెల (అక్టోబర్‌) 8వ తేదీన చెల్లించనుందని తెలిపారు. ఈ రెండు రకాల బోనస్‌లు, పండుగ అడ్వాన్స్‌ కలిపి కార్మికులు సగటున ఒక లక్షా 15 వేల రూపాయల వరకు రానున్న మూడు వారాల్లో అందుకోనున్నారని, ఈ మొత్తాన్ని దుబారా చేయకుండా వినియోగించుకోవాలని, పొదుపు చేయడం లేదా గృహావసరాలకు వాడుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని, తద్వారా ఈ ఏడాది మరింత మెరుగైన బోనస్‌లు, సంక్షేమం అందుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా సీఎండి ఎన్‌.శ్రీధర్‌ కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story