రైతు వేదికలపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య రగడ

by  |
రైతు వేదికలపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య రగడ
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సొమ్ము కేంద్రానిది.. సోకు మాత్రం రాష్ట్రానిది అంటే ఇదేనేమో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో తెలంగాణలో రైతు వేదికలకు నిర్మిస్తున్నారు. భవనాలపై సీఎం కేసీఆర్, మంత్రి అల్లోల, స్థానిక ఎమ్మెల్యేల చిత్రాలు మాత్రమే ఏర్పాటు చేస్తుండడంతో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వివాదం నెలకొంది. ప్రధాని మోడీ, ఎంపీ సోయం బాపురావు చిత్రాలు ఉండాల్సిందేనని బీజేపీ శ్రేణులు ఆందోళన బాట పట్టారు. స్వతంత్ర, ఇతర పార్టీల సర్పంచులు ఉన్న చోట్ల వేదికలపై ఎవరి చిత్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వారిపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలున్నాయి. మరోవైపు వేదికల నిర్మాణం పూర్తయినా, ఊరికి దూరంగా ఉండడం, తదితర కారణాలతో మూడునెలలైనా వాడుకలోకి రాలేదు.

నిర్మల్ జిల్లా తానూరు మండలం బోల్సా గ్రామంలో నిర్మించిన రైతు వేదిక ఊరికి దూరంగా ఉంది. హడావుడిగా పనులు పూర్తి చేసినా ప్రారంభోత్సవానికే పరిమితమైంది. ప్రహారీ, ఫెన్సింగ్ నిర్మించకపోగా.. తాళం వేసి ఊరికే ఉంచారు. ఈ వేదికపై ప్రధాని మోడీ ఫొటో లేదని గతంలో బీజేపీ నాయకులు ఆందోళన చేయగా.. తాజాగా ఇటీవల ప్రారంభోత్సవం వేళ మళ్లీ ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో అప్పటికప్పుడు మోదీ ఫొటోను వేయించారు. ఆదివారం అదే మోదీ చిత్రంపై పేడ కొట్టడం వివాదానికి దారి తీసింది. ఈ విషయమై బీజేపీ నాయకులు ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధ్యులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో విరమించారు.

ముధోల్​లో నిర్మించిన రైతు వేదికపై ఎవరి చిత్రాలు వేయించలేదు. ఇక్కడ సర్పంచ్ ​స్వంతత్రుడు కావడం, చిత్రాలు వేయాలని నిబంధనలు లేకపోవడంతో అధికారులు ఒత్తిడి చేసినా పట్టించుకోలేదు. దీంతో ప్రారంభోత్సవానికి ముందు సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే చిత్రాల ఫ్లెక్సీలు పెట్టారు. ఇదే మండలం విఠోలి గ్రామంలో సర్పంచి విపక్ష పార్టీకి చెందిన వ్యక్తి కాగా, రైతు వేదికపై సీఎం, మంత్రి, ఎమ్మెల్యే చిత్రాలు వేస్తే, ప్రధాని మోదీ, ఎంపీ సోయం బాపురావు చిత్రాలు ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. దీంతో ఎవరి చిత్రాలు లేకున్నా.. ఇటీవల ప్రారంభోత్సవం చేశారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల పరిస్థితి ఇలాగే ఉంది.

రూ. 22 లక్షల వ్యయంలో రూ. 12 లక్షలు కేంద్రానివే..

రైతులు ఒక చోట సమావేశమయ్యేందుకు రూ.22 లక్షల వ్యయంతో వేదికలు నిర్మించారు. ఇందులో రాష్ట్ర వ్యవసాయ శాఖ రూ.10 లక్షలు ఇవ్వగా.. కేంద్ర నిధులు రూ.12 లక్షలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో దసరా నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో కలెక్టర్లు.. అధికారులు సర్పంచులపై ఒత్తిడి చేయడంతో ఎలాగోలా పనులు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 305 వ్యవసాయ క్లస్టర్లలో వీటిని నిర్మించారు. స్థానిక సర్పంచులకు నిర్మాణ బాధ్యత అప్పగించగా.. నామినేషన్ పద్ధతిన పనులు చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పనులు చేయగా.. ఉన్నతాధికారుల ఒత్తిడులు, సస్పెన్షన్లు, నోటీసుల భయంతో హడావుడిగా పూర్తి చేశారు. వేదికలో ఏఈవో గది, సమావేశ మందిరం, ల్యాబ్ కోసం గదిని నిర్మించారు.

వైదికలపై చిత్రాల లొల్లి..

రైతు వేదికలపై సీఎం కేసీఆర్, మంత్రి ఐకేఆర్, స్థానిక ఎమ్మెల్యేల చిత్రాలు వేయిస్తున్నారు. కేంద్రం నిధులు ఇస్తున్నందున ప్రధాని మోదీ, ఎంపీ సోయం చిత్రాలు గీయించాలని బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగుతున్నారు. విపక్ష పార్టీలు, స్వతంత్ర సర్పంచులు ఉన్న చోట ఎవరి చిత్రాలు గీయించకపోవడంతో అధికారులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారు. అయితే వేదికలపై చిత్రాలు వేయించాలనే నిబంధన ఎక్కడా లేదు. కేంద్రం ఇచ్చే సొమ్ములతో రాష్ట్ర ప్రభుత్వం సోకు చేస్తోందని, సీఎం, మంత్రి, స్థానిక ఎమ్మెల్యేల చిత్రాలు గీసినప్పుడు ప్రధాని మోదీ, స్థానిక ఎంపీ చిత్రాలు గీయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

మూడు నెలలయినా రాని బిల్లులు

రైతు వేదికల నిర్మాణాలు పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా.. కొన్ని చోట్ల ఇప్పటికీ బిల్లులు పూర్తిగా రాలేదు. శాస్త్రవేత్తలు, ఇతర సామాగ్రి లేకపోవడంతో తాళం వేసి ఉంచడంతో అవి వినియోగంలోకి రావడం లేదు. కొన్నింటికి ఫెన్సింగ్ వేయగా.. చాలా చోట్ల అదీకూడా లేదు. చాలా చోట్ల ప్రారంభోత్సవాలు పూర్తవగా.. ఎక్కడా వినియోగంలోకి రాలేదు. రైతులు యాసంగిలో పంటల సాగు చేయగా.. రైతు వేదికల తాళాలు తీయడ లేదు. రైతులకు ఎలాంటి శిక్షణా తరగతులు నిర్వహించడంలేదు. ఎలాంటి పంటలు వేయాలి.. ఏం సస్యరక్షణ చర్యలు తీసుకోవాలో చెప్పడం లేదు. సమావేశాలు పెట్టేందుకు, శిక్షణ ఇచ్చేందుకు ఇంకా ఆదేశాలు రాలేదని, వారం రోజుల్లో సామగ్రి వస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.


Next Story

Most Viewed