ఇండిపెండెంట్ ఇళ్లే సో బెటర్..

by  |
ఇండిపెండెంట్ ఇళ్లే సో బెటర్..
X

దిశ, రంగారెడ్డి : కరోనా మహమ్మారి తెలంగాణను కారుమబ్బులా కమ్మేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని ప్రాంతాల్లో కొవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు పెరుగుతున్నది. దీంతో నగర‌వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే సమయంలో సొంతూరును వదిలి నగరానికి వలసొచ్చి స్థిరపడుతున్నారు. అయితే, ఇన్ని రోజులు అపార్టుమెంట్లకు అలవాటు పడిన కుటుంబాలు ఇప్పుడు ఇండిపెండెంట్ ఇండ్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. అపార్ట్ మెంట్‌లో ఇరుకు వాతావరణం ఉంటుందని, గాలి, వెలుతురు తక్కువగా ఉండటంతో పాటు ఎక్కువ మంది నివాసం ఉంటారు. దాంతో అక్కడ కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉంటుందని భయపడుతున్నారు. అంతేగాకుండా అపార్ట్‌మెంట్‌లోకి ఎవరెవరో వస్తారు, పోతారనే ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్లాట్లు ఖాళీ చేసి.. నగర శివారులోని ఇండ్లకు షిఫ్ట్ అవుతున్నారు. మరికొందరు సొంతూళ్లకు పయనమవుతున్నారు.

శివారు ఇండ్లకు డిమాండ్..

వంగూరి మహేందర్ రెడ్డి చింతలకుంటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఇతను ఓ పెయింట్ కంపెనీలో సెల్స్ మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇంట్లో నుంచి బయటికి వచ్చి నిలబడే పరిస్థితి అపార్ట్‌మెంట్‌లో లేదని చెబుతున్నాడు. అందుకే ఇండిపెండెంట్ ఇంటికి వెళ్లాలని భావిస్తున్నానని అంటున్నాడు. నగర శివారులోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని పసుమాముల, తొర్రూర్, తుర్కయంజాల్, ముణగనూర్ ప్రాంతాల్లో ఇండిపెండెంట్ ఇండ్లు అద్దెకు కావాలని మహేందర్ రెడ్డి వంటి వారు చాలా మంది వెతుకుతున్నారు. ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఉండే వాళ్లు శివారుల్లోకి వస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ల్లో ఉండే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా శివారులో ఉండే ఇండ్లకు షిఫ్ట్ అవుతున్నారు. ఓ ప్రధాన సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే వెంకటేశ్వర్లు బంజారాహిల్స్ నుంచి బోడుప్పుల్‌లోని ఇండిపెండెంట్ ఇంటికి మారాడు.

అపార్ట్‌మెంట్‌ల్లో అవస్థలు..

ఒకప్పుడు అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ఉండేందుకు అందరూ ఆసక్తి చూపేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. అపార్ట్‌మెంట్ వద్దురా దేవుడా అనే పరిస్థితి వచ్చింది. కారణం కరోనానే..అపార్ట్‌మెంట్‌లలో మహిళలు కిట్టీ పార్టీలు, ఫంక్షన్లు, టూర్లు, సమావేశాలు, డే సందర్భంగా జరిగే ఫంక్షన్లకు కలిసే అవకాశముంటుంది. పార్కింగ్, మీటింగ్‌లు, లిఫ్టు వంటి ప్రదేశాల్లో కలిసే అవకాశముంటుంది. కాబట్టి కొవిడ్ వ్యాప్తి వేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో భయంతో అపార్టుమెంట్లలో ఉండేందుకు జనం జంకుతున్నారు.

అక్కడ సేఫ్ అని..

సిటీ శివారులో ఉండే ఇండిపెండెంట్ హౌజ్‌లలో అయితే కొంత వారు ఎవరూ రారని, ఒకవేళ వచ్చినా తప్పక ఇంటి గేటు బయటే ఆగిపోతారని ప్రజలు భావిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఎవరూ ఇంటికి రాకుండా ఉండటమే ఉత్తమమని భావించే వారు ఇప్పటికే సిటీ అపార్టుమెంటు ఫ్లాట్లు ఖాళీ చేస్తున్నారు. శివారుల్లోని మేడ్చల్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మారుమూల గ్రామాల్లో నిర్మించిన ఇండిపెండెంట్ ఇండ్లను అద్దెకు తీసుకొని ఉంటున్నారు. మరికొంత మంది ఉపాధి లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లి పోతున్నారు. శివారు ప్రాంతాల్లోని ఇండిపెండెంట్ ఇండ్లల్లో ఉంటే ఒక కుటుంబం నుంచి మరొక కుటుంబం దూరంగా ఉండొచ్చని, కొంత మానసికోల్లాసం కూడా కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Next Story

Most Viewed