విస్తృతమవుతున్న టెక్నాలజీ.. సినిమాకు భవిష్యత్తు ఏమవుతుంది?

by Chukka Sudharani |

సినిమా ఒక కళ. AI ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే. సినిమా భావోద్వేగాల కలయిక, సృజనాత్మకతకు ప్రతిరూపం.

విస్తృతమవుతున్న టెక్నాలజీ.. సినిమాకు భవిష్యత్తు ఏమవుతుంది?
X

దిశ, సినిమా: సినిమా ఒక కళ. AI ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే. సినిమా భావోద్వేగాల కలయిక, సృజనాత్మకతకు ప్రతిరూపం. అయితే, కృత్రిమ మేధ (AI) అనే కొత్త టెక్నాలజీ విస్తృతమవుతున్న ఈ కాలంలో “సినిమాకు భవిష్యత్తు ఏమవుతుంది?” అనే ప్రశ్నలు తరచూ వినిపిస్తున్నాయి. మంచి కెమెరా ఉన్నంత మాత్రాన మంచి సినిమా తీయలేము కదా. కాస్ట్లీ పెయింట్‌ బ్రష్ చేతిలో ఉన్నంత మాత్రాన ఒక అందమైన పెయింటింగ్ వేయలేము కదా? గొప్ప ఆర్టిస్ట్ అవ్వలేము కదా!. అదే విధంగా.. AI వాడగలిగినంత మాత్రాన ఎవరైనా గొప్ప సినీ దర్శకుడు అవుతారని అనుకోవడం పొరపాటు. కథ బలం లేకుండా, కథలో భావోద్వేగం లేకుండా, అనుభవ రాహిత్యంతో ఏ టెక్నాలజీ కూడా ఒక ప్రతిభావంతమైన సినిమాను సృష్టించలేదు.

కళ అనేది అంతర్గత యుద్ధం. ఒక దర్శకుడు తన ఆత్మను, తన అనుభవాలను, తన భావోద్వేగాలను తెరపై ప్రతిబింబించడానికి తనలో తాను ఒక యుద్ధమే చేస్తాడు. ఆ కృషి, ఆ పట్టుదలతో ఎంతో శ్రమిస్తాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంత మంది టెక్నీషియన్స్‌ల, కళాకారుల సహకారం తీసుకుంటాడు. ఎన్నో విఫలయత్నాల తర్వాతే ఒక గొప్ప సినిమా రూపుదాల్చుతుంది. AI సహాయం తీసుకోవడం తప్పు కాదు. కానీ దానిని ఒక "shortcut"గా భావించడం మాత్రం తప్పు. ఎందుకంటే టెక్నాలజీ ఒక కథకు భారీతనాన్ని ఇవ్వగలదు, కానీ భావోద్వేగాన్ని మాత్రం ఇవ్వలేదు. కథలోని భావోద్వేగమే ఒక సినిమాకు ప్రాణం. AI లాంటి కృతిమ మేధస్సుతో, సాగర సంగమం, శివ, లాంటి సినిమాలు చేయగలరా? టైటానిక్, జురాసిక్ పార్క్, అవతార్ లాంటి టెక్నాలజీ సినిమాలు కూడా చేయలేము.. అద్భుత చిత్రాలు ఒక కృతిమ యంత్రం వల్ల పుట్టలేదు. అవి మానవ సృజనాత్మకత వల్లే పుట్టాయి. కాబట్టి “AI సినిమాను మించేస్తుంది” అనే భయం అసలు ఆధారంలేనిది. సినిమా సృష్టి అనేది ఒక కళాకారుడి ఆత్మతో ముడిపడి ఉంటుంది. AI అనేది ఒక సాధనం మాత్రమే. దాన్ని ఉపయోగించాలి, కానీ దానికి బానిసలు కావద్దు. - LAXMAN MURARISHETTY Tollywood Film Maker

Next Story