విద్యార్థులారా మేల్కొండి.. AI విప్లవం ముందు విద్య చనిపోయింది: రామ్ గోపాల్ వర్మ

by Malleboina Mahesh |

AI విప్లవం ముందు విద్య చనిపోయింది” అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

విద్యార్థులారా మేల్కొండి.. AI విప్లవం ముందు విద్య చనిపోయింది: రామ్ గోపాల్ వర్మ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మళ్లీ ఒక సంచలన వ్యాఖ్యతో సోషల్ మీడియాలో హీట్ క్రియేట్ చేశారు. “విద్యార్థులారా మేల్కొండి.. AI విప్లవం ముందు విద్య చనిపోయింది” అంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆయన అభిప్రాయం ప్రకారం, కృత్రిమ మేధస్సు (AI) విస్ఫోటనం కారణంగా మన ప్రస్తుత విద్యా వ్యవస్థ పూర్తిగా పాతబడిపోయిందని, దీన్ని పూర్తిగా పునరాలోచించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. మెమరీ ఆధారిత విద్యా విధానం ఇక పనికిరాదని, “AI ఒక్క క్లిక్‌తో లక్షల కేసులు విశ్లేషించి చికిత్స సూచించగలిగితే, విద్యార్థులు ఎందుకు 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడంలో గడపాలి?” అని ప్రశ్నించారు.

ఆర్జీవీ అభిప్రాయం ప్రకారం భవిష్యత్తు విద్యా విధానం పుస్తకాలలో ఉన్న సమాచారాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు, AI పరికరాలను సృజనాత్మకంగా ఉపయోగించడం నేర్చుకోవడంలో ఉండాలి. “AI విశ్వవిద్యాలయాలు లేదా బోర్డులు సిద్ధం అయ్యే వరకు వేచి ఉండదు. మార్పు చెందని వ్యవస్థను చెరిపేస్తుంది” అంటూ ఆయన హెచ్చరిక చేశారు. అలాగే పాఠశాలలు కూడా బోధన విధానాన్ని మార్చి, AIని పరీక్షల్లో సహాయక సాధనంగా అనుమతించాలని సూచించారు.

తన ట్వీట్ చివర్లో “AI మిమ్మల్ని చంపదు, కేవలం పట్టించుకోదు” అంటూ ఆర్జీవీ చేసిన వ్యాఖ్య విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తిస్తోంది. ఆయన హెచ్చరిక ప్రకారం, “AIని వాడలేని వారు భవిష్యత్తులో AI చేతనే వాడబడతారు” అనే మాటలు నూతన విద్యా దిశను సూచిస్తున్నాయి. ఈ ట్వీట్ ప్రస్తుతం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్యలో విస్తృత చర్చకు దారి తీస్తోంది.

Next Story