Stand-up comedian Anudeep : పరారీలో స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల!

by Ramesh Naini |   (  Updated:2026-04-12 16:56:46  IST  )

స్టాండప్ కామెడీ పేరుతో ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కమెడియన్ అనుదీప్ కటికాల పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Stand-up comedian Anudeep : పరారీలో స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల!
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్టాండప్ కామెడీ పేరుతో ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కమెడియన్ అనుదీప్ కటికాల పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులపై కామెంట్లు చేయడంతో తీవ్ర దుమారం రేగింది. అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో అనుదీప్ తన ఫోన్ స్విచాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుగు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కట్టలు తెంచుకున్న అభిమానుల ఆగ్రహం

కొణిదెల నిహారిక విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ, ఏపీ డీసీఎం పవన్ కల్యాణ్‌ను కించపరిచేలా అనుదీప్ వ్యాఖ్యలు చేశారని మెగా అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ అనుదీప్ షోలు నిర్వహించే ‘ది స్ట్రీట్ కామెడీ క్లబ్’ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అక్కడ వేరే కమెడియన్ షో చేస్తుండగా లోపలికి వెళ్లి అనుదీప్ కోసం ఆరా తీశారు. అతను లేకపోవడంతో తీవ్ర స్థాయిలో బూతులు తిడుతూ, బయటకు వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభిమానులు హెచ్చరికలు జారీ చేశారు.

నిలిచిపోయిన స్టాండప్ షోలు..

ఈ వివాదం ముదరడంతో సోమాజిగూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోని స్టాండప్ కామెడీ సెంటర్ల నిర్వాహకులు అప్రమత్తమై షోలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.

హద్దులు దాటిన వినోదం.. నిర్వాహకుల బాధ్యత

నవ్వించడం అంటే హద్దులు దాటి వ్యక్తిగత జీవితాలను కించపరచడం, బూతులు తిట్టడం కాదని ఈ అంశంపై నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలాంటి అడ్డదారి ఫేమ్ కోసం కొందరు చేసే ప్రయత్నాల వల్ల నిజమైన టాలెంట్ ఉన్న యువ కమెడియన్లకు, మొత్తం స్టాండప్ కామెడీ రంగానికే చెడ్డపేరు వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ ఏంటో పరిశీలించకుండా అసభ్యకర ప్రసంగాలు చేసేవారికి వేదికలు కల్పిస్తున్న సంస్థలు సైతం బాధ్యత వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Next Story