రోడ్డెక్కి చూడండి పెట్రోల్ కష్టాలు తెలుస్తాయ్.. ప్రభుత్వంపై నటి ఫైర్

by Bhoopathi Nagaiah |

దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలపై ప్రముఖ నటి, టీవీ హోస్ట్ సాదియా ఇమామ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

రోడ్డెక్కి చూడండి పెట్రోల్ కష్టాలు తెలుస్తాయ్.. ప్రభుత్వంపై నటి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచదేశాల్లో ఇంధన కొరత తీవ్రంగా ఏర్పడింది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి నుంచి చమురును రవాణా చేసుకునే దేశాలు తీవ్ర సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ యుద్ధ ప్రభావం ముస్లిం కంట్రీస్‌పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. తాజాగా పాక్‌లో పెట్రోల్ ధరలు ఆకాశానంటాయి. లీటరు ధర రూ.300లకు చేరుకోవడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ధర పెరిగినా పెట్రోల్ దొరకకపోవడంతో అన్నివర్గాల ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం, అక్కడి ప్రతిపక్షనాయకులపై ప్రముఖ నటి, టీవీ హోస్ట్ సాదియా ఇమామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెట్రోల్ ధరల పెరుగుదల, అక్కడి నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ వీడియోని రిలీజ్ చేసింది.

సాదియా ఇమామ్ మాట్లాడుతూ.. “మీరు అందరూ చచ్చిపోతే పోయేదేముంది? కొత్తవాళ్లు వస్తారు, కొత్త ఆలోచనలు వస్తాయి. పెట్రోల్ ధరలు అనవసరంగా పెంచుతున్నారు. పాత స్టాక్ ఉన్నప్పటికీ కొత్త ధరలు ఎలా నిర్ణయిస్తారు? భారతదేశం, బంగ్లాదేశంలో అలా పెంచలేదు కదా? ఇరాన్ నుంచి చౌకగా పెట్రోల్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు దానిని విపియోగించుకోవడం లేదు?’’ అని ఆమె ప్రశ్నలను సంధించింది. అలాగే ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, బిలావల్ భుట్టో జర్దారీ, ఇతర నాయకులను ఉద్దేశించి సాదియా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రజలు రోడ్లెక్కి ఇబ్బంది పడుతుంటే మీరు ఎక్కడున్నారు? ప్రజల సమస్యలు మీకు కనిపించడం లేదా? ఐఎంఎఫ్ అప్పుల కారణంగా దేశం ఆర్థిక ఒత్తిడిలో ఉంటే కనిపించడం లేదా’’ అంటూ నిలదీసింది. ప్రస్తుతం సాదియా ఇమామ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. మరోవైపు నెటిజన్స్ సైతం ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్లు ఉండాలని కితాబు ఇస్తున్నారు.

Next Story