జస్టిస్ హేమ కమిటీ నివేదికలో సంచలనం.. 35 కేసులు మూసివేత

by Yella Dhawani Reddy |

మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన జస్టిస్ హేమ కమిటీ మరోసారి చర్చనీయాంశంగా మారింది.

జస్టిస్ హేమ కమిటీ నివేదికలో సంచలనం.. 35 కేసులు మూసివేత
X

దిశ, వెబ్ డెస్క్: మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన జస్టిస్ హేమ కమిటీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టులో (justice hema committee report) నమోదైన కేసులన్నింటినీ మూసివేస్తున్నట్లు తాజాగా సిట్ (SET) కేరళ హైకోర్టుకు తెలిపింది. జస్టిస్ హేమ కమిటీ రిప్టోరు ఆధారంగా నమోదైన 35 కేసుల దర్యాప్తు చేసేందుకు సిట్‌ ఏర్పాటైన విషయం తెలిసిందే. బాధితులు వాంగ్మూలం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని న్యాయస్థానానికి సిట్ వెల్లడించింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ఆ కేసులను మూసివేయాలనే ఆదేశాలు జారీ చేసింది.

2017లో కొచ్చిలో ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్ కేసు సంచలనం సృష్టించింది. రౌడీలతో ఆమెపై లైంగిక వేధింపులు జరిపారని, నటుడు దిలీప్‌ ప్రధాన కుట్రదారుడిగా వ్యవహరించాడని ఆరోపణలొచ్చాయి. ఆ కేసులో అతడు అరెస్టు అయ్యాడు. ఈ కేసు తరువాతే మలయాళ సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న దురాచారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో 2019లో కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి పరిశ్రమలో మహిళల పరిస్థితులపై అధ్యయనం చేయించింది. కమిటీ రూపొందించిన 235 పేజీల నివేదికలో పలువురు మహిళలు తమ అనుభవాలను వెల్లడించారు. వర్క్ ప్లేస్‌లో వేధింపులు, సముచిత పారితోషికం లభించకపోవడం, మహిళల ప్రమేయం తగ్గిపోతుండటం వంటి పలు అంశాలను కమిటీ హైలైట్ చేసింది. కొందరు మహిళలు తాము ఎదుర్కొన్న వేధింపులను పబ్లిక్‌గా వెల్లడించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం ఏర్పడింది.

ఇక ఈ వివాదం తీవ్రతతో మలయాళ సినిమా రంగంలోని అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌(AMMA)లో కీలక మార్పులు వచ్చాయి. నటుడు మోహన్‌లాల్‌తో పాటు పలువురు సభ్యులు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ బాధితులు భయంతో ముందుకు రాకపోవడమే విచారణలో ఆటంకంగా మారింది. కేసుల మూసివేతతో మహిళా హక్కుల ఉద్యమకారులు మళ్లీ అధికారులపై ప్రశ్నలు వేస్తున్నారు.

Next Story