సినీ ఇండస్ట్రీలో ఘోరం.. లేడీ సింగర్ కిడ్నాప్, దారుణ హత్య

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-19 10:07:02  IST  )

పంజాబీ గాయని ఇందర్ కౌర్ లూధియానా కాలువలో శవమై తేలడం సంచలన సృష్టిస్తోంది.

సినీ ఇండస్ట్రీలో ఘోరం.. లేడీ సింగర్ కిడ్నాప్, దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ సినీ ఇండస్ట్రీలో భయానక ఘటన చోటుచేసుకున్నది. ప్రముఖ పంజాబీ గాయని, మేకప్ ఆర్టిస్ట్ ఇందర్ కౌర్ (Inder Kaur) అనుమానాస్పద స్థితిలో ఓ కాలువలో శవమై తేలారు. లూధియానా జిల్లా నీలోన్ పరిధిలోని సిర్హింద్ కాలువలో ఆమె డెడ్‌బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బలవంతంగా పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడం వల్లే ఆమెను కిడ్నాప్ చేసి, హత్య చేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

తుపాకీతో బెదిరించి కిడ్నాప్..

పోలీసుల కథనం మేరకు మే 13న సాయంత్రం జమాల్‌పూర్‌ (Jamalpur)లోని తన నివాసం నుంచి కారులో కిరాణా సామాగ్రి కొనేందుకు ఇందర్ కౌర్ బయటకు వెళ్లారు. అయితే, ఆమె మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు మే 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితుడు తన అనుచరులతో కలిసి ఇందర్‌ను తుపాకీతో బెదిరించి, కారుతో సహా కిడ్నాప్ చేశాడని వారు ఆరోపించారు. ఇందర్ కౌర్ సోదరుడు జోతీందర్ సింగ్ (Jotinder Singh) ఈ ఘటనపై సంచలన విషయాలు వెల్లడించారు. మోగా ప్రాంతానికి చెందిన సుఖ్విందర్ సింగ్ (Sukhwinder Singh) అనే వ్యక్తితో ఇందర్ కౌర్‌కు కొన్నేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అయితే, సుఖ్విందర్‌కు ఇదివరకే పెళ్లయి, పిల్లలు ఉన్నారనే నిజం ఇందర్‌కు ఆలస్యంగా తెలిసింది. దీంతో ఆమె అతనితో మాట్లాడటం మానేసి, దూరం పెట్టింది. అతను పెళ్లి చేసుకోవాలని వేధించినా ఒప్పుకోలేదు. ఈ కక్షతోనే అతను తన చెల్లెలిని పొట్టనబెట్టుకున్నాడని జోతీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు సుఖ్విందర్ సింగ్ కెనడా నుండి నేపాల్ మీదుగా రహస్యంగా పంజాబ్‌కు చేరుకున్నాడని, హత్య చేసిన అనంతరం అతను తిరిగి కెనడాకు పారిపోయాడని ఇందర్ కౌర్ ఆరోపిస్తున్నారు.

కేసు నమోదు.. పోలీసుల దర్యాప్తు..

స్థానికుల సమాచారంతో కాలువలో పడి ఉన్న డెడ్‌బాడీని పోలీసులు వెలికితీశారు. కుటుంబ సభ్యులు ఆమెను ఇందర్ కౌర్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులపై కిడ్నాప్, హత్య కేసులు నమోదు చేసి, పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story