డైలాగ్స్ లేకుండా హావభావాలు పలికించడం చాలెంజింగ్‌గా అనిపించింది: జ్యోతిక

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-17 15:03:09  IST  )

సారికా రావత్ పాత్ర చాలా ఎమోషనల్ అండ్ పవర్‌ఫుల్. ఆమె కోర్టులో జరిగే ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తూ, నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది.

డైలాగ్స్ లేకుండా హావభావాలు పలికించడం చాలెంజింగ్‌గా అనిపించింది: జ్యోతిక
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ జ్యోతిక, ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఓవైపు సినిమాలుచేస్తూనే వెబ్‌సిరీస్‌లలో తన సత్తా చాటుతోంది. బాలీవుడ్‌లోనూ అదరగొడుతున్న నటి జ్యోతిక.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ చిత్రం ‘సిస్టమ్’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారి తెరకెక్కిస్తున్న ఈ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ సినిమాలో జ్యోతిక, సోనాక్షి సిన్హా, అశుతోష్ గోవారికర్ కీలక పాత్రలో నటించారు. అయితే ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పలు విశేషాలతో పాటు తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. "సారికా రావత్ పాత్ర చాలా ఎమోషనల్ అండ్ పవర్‌ఫుల్. ఆమె కోర్టులో జరిగే ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తూ, నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది.

అదే సమయంలో ఒక తల్లిగా ఇల్లు, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసే సాధారణ మహిళ పాత్ర ఇది. ఈ సినిమాలో డైలాగ్స్ కంటే సైలెన్స్‌తోనే ఎక్కువ హావభావాలు పలికించాల్సి వచ్చింది. ఇది నాకు చాలా చాలెంజింగ్‌గా అనిపించింది" అని చెప్పారు. హిందీ ఇండస్ట్రీలో నలభై ఏళ్లు దాటిన మహిళా నటీమణుల కోసం వైవిధ్యమైన, లోతైన పాత్రలు రాయడం పట్ల జ్యోతిక సంతోషం వ్యక్తం చేశారు. సౌత్ సినిమాలకు, హిందీ కంటెంట్‌కు మధ్య ఉన్న తేడా వివరిస్తూ.. "సౌత్ సినిమాలు థియేటర్లలో అద్భుతంగా ఆడుతున్నాయి, అక్కడ నటించడం నాకు ఎప్పుడూ ఇష్టమే. కానీ అక్కడ చాలా పాత్రలు ఇప్పటికీ పురుషుల కోణంలోనే రాయబడుతున్నాయి. అయితే హిందీలో, ముఖ్యంగా ఓటీటీ పుణ్యమా అని మహిళల పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, విభిన్న కోణాల్లో కథలను అల్లుతున్నారు" అని జ్యోతిక అభిప్రాయపడ్డారు.

Next Story