- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్ పెద్ది సినిమాకు కొత్త కష్టాలు.. ‘పెద్ది’ విడుదల వేళ నిర్మాతలకు ఎగ్జిబిటర్ల అల్టిమేటం
టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' థియేట్రికల్ ప్రదర్శనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' థియేట్రికల్ ప్రదర్శనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా ప్రదర్శనకు సంబంధించి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. 'పెద్ది' చిత్ర ప్రదర్శనకు గానూ తమకు ఖచ్చితంగా పర్సంటేజ్ (వాటా) ఇవ్వాల్సిందేనని, నిర్మాతలు ఆ పర్సంటేజ్‌కు అంగీకరిస్తూ ఒప్పందంపై సంతకం చేసి ఇస్తేనే థియేటర్లలో సినిమా ఆడిస్తామని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సుధీర్ఘ నిరీక్షణను, ఆవేదనను మీడియాతో పంచుకున్నారు. "అంతకుముందు 'హరిహర వీరమల్లు” సినిమా విడుదల సమయంలోనే మేము ఈ పర్సంటేజ్ డిమాండ్‌ను గట్టిగా వినిపించాలనుకున్నాం. అయితే ఆ సమయంలో డిమాండ్లు పెడితే సినిమాకు ఇబ్బంది అవుతుందని కొందరు కోరడంతో ఇండస్ట్రీ హితం కోరి వెనక్కి తగ్గాం. ఆ తర్వాత నుంచి మా డిమాండ్‌ను నిరంతరం వినిపిస్తూనే ఉన్నాం. ఇప్పుడు 'పెద్ది' సినిమా కూడా వాయిదా పడుతూ ఇక్కడి వరకు వచ్చింది" అని వారు పేర్కొన్నారు.
నిర్మాతల జాప్యంపై ఆగ్రహం..
పర్పంటేజ్ విషయంలో నిర్మాతలు కావాలనే కాలయాపన చేస్తున్నారని ఎగ్జిబిటర్లు ఆరోపించారు. "పోనీ ఈ 'పెద్ద' సినిమాను వదిలేసి, వచ్చే తదుపరి పెద్ద సినిమా నుండి ఈ నిబంధన అమలు చేద్దామని కొందరు అంటున్నారు. లేదా ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి మరో మూడు వారాల సమయం కావాలని కోరుతున్నారు. ఇలా వాయిదాలు వేసుకుంటూ పోవడం ఇక ఎంతమాత్రం కరెక్ట్ కాదని భావించాం. అందుకే 'పెద్ది' సినిమా నుంచే ఖచ్చితంగా పర్సంటేజ్ పద్ధతిలోనే ఆడించాలని గట్టి నిర్ణయం తీసుకున్నాం" అని అసోసియేషన్ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 250 మంది థియేటర్ ఎగ్జిబిటర్లందరిదీ ఒకటే మాట అని, ఎవరూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. డిమాండ్లకు నిర్మాతలు అంగీకరించి సంతకం పెడితేనే ప్రదర్శనకు సహకరిస్తామని, లేనిపక్షంలో సినిమాను థియేటర్లలో ఆడించబోమని అల్టిమేటం జారీ చేశారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ వివాదంపై 'పెద్ద' చిత్ర నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.






