టమాటా ధరలకు చెక్.. ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త

by  |
టమాటా ధరలకు చెక్.. ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త
X

దిశ, రాయలసీమ: రాష్ట్రంలో టమాటా రికార్డ్ ధర పలుకుతోంది. టమాటా స్పీడుకు బ్రేకులు వేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో మార్కెటింగ్‌ శాఖ నేరుగా రైతుల నుంచి టమాటాలను కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయాలు చేపట్టింది. అనంతపురం, చిత్తూరు మార్కెట్‌ యార్డుల్లో రైతుల నుంచి కిలో రూ.50–55 చొప్పున కొనుగోలు చేసి కడప, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రైతు బజార్ల ద్వారా రవాణా ఛార్జీలతో కలిపి రూ.60 చొప్పున విక్రయిస్తోంది.

ఈ టమాటాలను ఒక్కో వినియోగదారుడికి కిలో చొప్పున అందిస్తున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ విక్రయాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రోజుకు ఏడు నుంచి 10 టన్నుల చొప్పున కొనుగోలు చేస్తుండగా.. రానున్న రోజుల్లో కనీసం వంద టన్నులు రైతుల నుంచి సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. వర్షాలు, వరదల వల్ల పంటలు దెబ్బతినడంతో టమాటా ధర పెరిగింది. ప్రభుత్వ చర్యలతో రానున్న వారం రోజుల్లో ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయి.

గత నెల రోజులుగా భారీ వర్షాలు, వరదలతో టమాటా పంటకు నష్టం వాటిల్లింది. అందుకే తీవ్ర కొరత ఏర్పడి టమాటా ధరలు పెరిగాయి. ఈ పరిస్థితిని గుర్తించి అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి టమాటా కొనుగోలు చేసి వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది. సకాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మరో వారం రోజుల్లో టమాటా ధర కిలో రూ.30–40కి దిగి వస్తుందని అంచనా వేస్తున్నారు.


Next Story

Most Viewed