అధికారుల నిర్లక్ష్యం.. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా బస్టాండ్

by  |
Busstand
X

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని చండ్రుగొండ మండల కేంద్రం సమస్యలకు నిలయంగా మారింది. ముఖ్యంగా మండల కేంద్రంలో అంతర్గత డ్రైనేజీ లేక వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా ఇళ్లల్లోకి వరద నీరు చేరుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో ఒక్క వీధిలో కూడా లింక్ డ్రైనేజీ సిస్టం లేక ఎక్కడ నీరు అక్కడే ఆగిపోతున్నాయి. తద్వారా దోమలు పెరిగి జ్వరాల బారిన పడుతున్నారు. గ్రామంలో శాశ్వత రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.

అదే విధంగా చండ్రుగొండ మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. బస్టాండ్ ఉన్నప్పటికీ ఆ బస్టాండ్ శిథిలావస్థకు చేరుకోవడం, బస్టాండ్ ఆవరణలో రాత్రి పూట అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని ప్రజలు వాపోతున్నారు, బస్టాండ్ ఆవరణలో మద్యం సీసాలు, సిగరెట్ వ్యర్ధాలు దర్శనమిస్తున్నాయి. మధ్యాహ్నం భోజన సమయంలో తప్ప బస్టాండ్‌లోకి బస్సులు రావట్లేదని ప్రజలు వాపోతున్నారు. బస్టాండ్‌లో త్రాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం ఉన్నప్పటికీ అవి శిథిలావస్థకు చేరుకొని పనికి రాకుండా పోయాయి. బస్టాండ్ మరుగుదొడ్లలో పెద్ద పెద్ద వృక్షాలుగా అయ్యాయంటే బస్టాండ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చండ్రుగొండ బస్టాండ్లో మరుగుదొడ్ల సదుపాయం లేకపోయేసరికి చండ్రుగొండ మీదుగా వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్టాండ్ కాంప్లెక్స్‌లో దుకాణాల వలన నెలకు వేలల్లో ఆదాయం వస్తున్నప్పటికీ అధికారులు సౌకర్యాలపై దృష్టిసారించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్లోకి బస్సులు రాకపోయేసరికి ప్రజలు రోడ్డుపైనే బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చండ్రుగొండ ప్రధాన సెంటర్లో ఉన్న మరో ప్రధాన సమస్య పబ్లిక్ టాయిలెట్స్.

ప్రధాన కూడలిలో పబ్లిక్ టాయిలెట్స్ లేక చుట్టుపక్కల గ్రామాల నుంచి చండ్రుగొండ మండల కేంద్రానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఇటీవల విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నేడు చండ్రుగొండ మండల కేంద్రానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రానున్న తరుణంలో మండల కేంద్రంలో ఉన్న ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపాలని మంత్రిని ప్రజలు కోరనున్నట్టు సమాచారం.

chandrugonda

Chadru



Next Story

Most Viewed