వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఏమన్నారంటే?

by  |
TDP
X

దిశ ఏపీ బ్యూరో: కిట్ల స్కామ్, బ్లీచింగ్ పౌడర్ కుంభకోణాలకు పాల్పడినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాను కట్టడి చేయలేకపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ట్విట్టర్ మాధ్యమంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై వరుస ట్వీట్లు చేశారు. వైద్యుడి ప్రాణాలను కూడా కాపాడలేని స్థితిలో రాష్ట్రం ఉండటం శోచనీయమని అన్నారు. తెనాలి ఆసుపత్రిలో రోగులకు సేవలందిస్తూ, కరోనా బారిన పడిన డాక్టర్… తన బిడ్డల కోసమైనా బతకాలని, మెరుగైన చికిత్స అందించి బతికించాలని వేడుకున్నా బతికించలేకపోయారని విమర్శించారు.

తమకు మర్యాద లేని చోట పనిచేయలేమంటూ చీఫ్ సెక్రటరీకి వైద్యుల సంఘం లేఖ రాయడం రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. సమీక్ష సమావేశానికి కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు ప్రకాశం జిల్లా డీఎంహెచ్ఓను నిల్చోబెట్టారని మండిపడ్డారు. ఇదే విధంగా అనంతపురం డీఎంహెచ్ఓను వ్యక్తిగతంగా దూషించారని అన్నారు. శ్రీకాకుళం, నెల్లూరు డీహెచ్ఎంఓలను సెలవుపై వెళ్లాలని ఒత్తిడి చేస్తుండటంతో పని చేయలేకపోతున్నట్టుగా వైద్యుల సంఘం లేఖలో డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. తెనాలి, నెల్లూరు, విజయవాడలో డాక్టర్లు చనిపోయినా ఇంతవరకు నష్టపరిహారం ప్రకటించలేదని విమర్శించారు.

మాస్క్ ల కోసం విశాఖలో డాక్టర్ల ధర్నా, రక్షణ పరికరాల కోసం ఒంగోలులో ల్యాబ్ టెక్నీషియన్ల ధర్నా… ఏమిటివన్నీ? మాస్క్ అడిగాడని దళిత డాక్టర్ సుధాకర్ పై కక్షగట్టి, నడి రోడ్డుపై లాఠీలతో కొట్టించారు. చిత్తూరు జిల్లాలో డాక్టర్ అనితారాణిపై అసభ్య వీడియోలు తీశారు. కరోనా విపత్తులో తమ ప్రాణాలు అడ్డుపెట్టి, ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యుల పట్ల ఏమిటీ అమానుషాలు? ఏ రాష్ట్రంలోనైనా వైద్యుల పట్ల ఈ నిర్లక్ష్యం ఉందా? కరోనా నుంచి రికవరీలో ఏపీ అట్టడుగున ఉండటం చూస్తే బాధేస్తోంది. మరోవైపు ఫ్రంట్ లైన్ వారియర్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఆవేదన కలిగిస్తోంది. ఇవి చాలవన్నట్టు కరోనా కిట్ల స్కామ్, బ్లీచింగ్ పౌడర్ కుంభకోణాలతో వైఎస్సార్సీపీ నేతల అవినీతి కరోనాతో పోటీపడుతోందని ఆయన విమర్శించారు.

Next Story

Most Viewed