మూడేళ్లలో దేశమంతా స్మార్ట్ మీటర్లు

by  |
మూడేళ్లలో దేశమంతా స్మార్ట్ మీటర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశమంతా స్మార్ట్ మీటర్లను బిగించే ప్రక్రియను మూడేళ్ల కాలంలో పూర్తి చేయాలని కేంద్ర ఇంధన శాఖ భావిస్తోంది. విద్యుత్ వృథాను అరికట్టడంతో పాటు పారదర్శకమైన వ్యవస్థను నెలకొల్పడానికి ఈ విధానం అనివార్యమని ఇప్పటికే కొన్ని ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా స్మార్ట్ మీటర్లను బిగించింది. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ సహకారంతో జరుగుతున్న ఈ ప్రక్రియ సంతృప్తికర ఫలితాలనే ఇచ్చిందని ఇంధన శాఖ అభిప్రాయపడుతోంది. రానున్న మూడేళ్ల కాలాన్ని లక్ష్యంగా పెట్టుకుని దేశమంతా స్మార్ట్ మీటర్లను బిగించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అవసరమైతే ఆయా రాష్ట్రాల్లోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అక్కడి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ల కోరితే మరో రెండేళ్ల గడువు ఇవ్వాలనుకుంటోంది.

కేవలం ఈఈఎస్ఎల్ మీద మాత్రమే ఆధారపడకుండా కొన్ని ప్రైవేటు సంస్థలను కూడా ఇందులో భాగస్వాములను చేసేలా ఇంధన శాఖ ఇటీవలే టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. దేశమంతా స్మార్ట్ మీటర్లను బిగించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో సామాన్యులపై భారం లేకుండా ఎలా చేస్తే బాగుంటుందనే విషయమై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ఇంధన శాఖ ఒక స్మార్ట్ మీటరును బిగించడానికి అయ్యే ఖర్చులో 15 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, మిగిలినదాన్ని వినియోగదారులకే వదిలేయాలనుకుంటోందని తెలుస్తోంది. ఒకేసారి 85 శాతం మేర ఖర్చును వినియోగదారులు భరించడం ఇబ్బందికరంగా ఉంటుందన్న ఆలోచనతో తొలుత కేంద్ర ప్రభుత్వమే సమకూర్చి వినియోగదారులు ప్రతీ నెలా వాయిదా పద్ధతిలో సర్వీసు చార్జి రూపంలో చెల్లించడానికి వెసులుబాటు కల్పించాలనుకుంటోంది.

సాంకేతిక సమస్యలపై దృష్టి..

స్మార్ట్ మీటర్ విధానంతో విద్యుత్ సరఫరాలో వృథాను అరికట్టడంతో పాటు పారదర్శకతను నెలకొల్పవచ్చని, నెలవారీగా ఏ మేరకు వినియోగించుకున్నారో దాని ప్రకారమే చెల్లింపు జరిగేటట్లుగా చేయవచ్చని కేంద్ర ఇంధన శాఖ అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల డిస్కంల పనితీరును అధ్యయనం చేసిన కేంద్ర ఇంధన శాఖ సగటున కనీసంగా 15 శాతం విద్యుత్ వృథా అవుతోందన్న నిర్ధారణకు వచ్చి, దాని నివారణకే స్మార్ట్ మీటర్ల వ్యవస్థ దోహదపడుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

స్మార్ట్ మీటర్ల విధానం ద్వారా డిస్కంలు ప్రతీ మీటర్‌లో వినియోగం ఏ సమయంలో ఎలా ఉంటుందో గమనించే వీలు ఉంటుంది. దానికి అనుగుణంగా సరఫరా వ్యవస్థలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వీలవుతుంది. పైగా అన్నీ‘ఆన్‌లైన్’ విధానంలో జరుగుతున్నందున వినియోగదారులకు సైతం ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్‌కే సమాచారం వెళ్తుంది కాబట్టి పొదుపు చేసుకోడానికి కూడా వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న సంప్రదాయ మీటర్లకు వచ్చే సమస్యలు అందులో రావనేది ఇంధన శాఖ అధికారుల అభిప్రాయం. కాగా, ఇందులో టెక్నాలజీ అంశాలు కూడా ఉన్నందున విద్యుత్ గ్రిడ్‌లో సైతం సాఫ్ట్‌వేర్‌ను వాడాల్సి ఉంటుందని, వాటిని ‘స్మార్ట్ గ్రిడ్’లుగా తీర్చిదిద్దాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే పూర్తిగా టెక్నాలజీతో నడిచే విధానంలో సైబర్ దాడులకు అవకాశం ఉంటుందని, దాన్ని తట్టుకునే వ్యవస్థను రూపొందించుకోవాలని వివరించారు.

ఇటీవల సైబర్ దాడుల కారణంగా ముంబై నగరంలో విద్యుత్ వ్యవస్థ కొన్ని గంటల పాటు కుప్పకూలిన అంశాన్ని ప్రస్తావించారు. లక్నో నగరంలో 15 లక్షల మీటర్లపై సైబర్ దాడుల ప్రభావాన్ని కూడా కమిటీకి అధికారులు వివరించారు. స్మార్ట్ మీటర్ల విధానం ద్వారా రాష్ట్రాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయనే కారణంతో సంసిద్ధత రాకపోవడాన్ని ఉదహరించిన కేంద్ర ఇంధన శాఖ అధికారులు కేవలం 15 శాతం మాత్రమే రాష్ట్రాలకు భారంగా ఉంటుందని, మిగిలిన దాన్ని కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుందని వివరించారు. మొత్తంగా రానున్న మూడేళ్ల కాలానికి స్మార్ట్ మీటర్ వ్యవస్థను పట్టాలపైకి ఎక్కించడానికి ఇకపైన నిర్దిష్ట విధి విధానాలు, మార్గదర్శకాలు జారీ కానున్నాయి.


Next Story