రైతుల ముందు కేంద్రం కీలక ప్రతిపాదనలు

by  |
రైతుల ముందు కేంద్రం కీలక ప్రతిపాదనలు
X

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై చర్చల్లో భాగంగా కేంద్ర మంత్రులు రైతు సంఘాల నాయకుల ఎదుట కొత్త ప్రతిపాదన ఉంచారు. మూడు వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నరపాటు నిలిపివేస్తామని సూచించింది. ప్రతిష్టంభనకు తెరదించడం కోసం చట్టాలపై చర్చించడానికి కేంద్రం, రైతులతో కూడిన సంయుక్త కమిటీ వేస్తామని తెలిపింది. కానీ, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలపై వెంటనే రైతు సంఘాల నాయకులు ఎలాంటి నిర్ణయం తెలుపలేదు. అంతర్గతంగా చర్చించుకుని వస్తామని తెలుపడంతో ఈ నెల 22న మరోసారి సమావేశం కావాలని కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతలు నిర్ణయానికి వచ్చారు. బుధవారం విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య పదో విడత చర్చలు జరిగాయి. కొంత మంది రైతులకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) నోటీసులు జారీ చేయడంపై కేంద్ర మంత్రులను రైతు సంఘాల నాయకులు నిలదీశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలకు మద్దతు ఇస్తున్న వారిని వేధించడంలో భాగంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఈ విషయమై కేంద్ర మంత్రులు స్పందిస్తూ ఎన్‌ఐఏ నోటీసులపై పరిశీలన జరుపుతామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నరపాటు వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేస్తామని, ఇంటికి వెళ్లాలని రైతు సంఘాల నాయకులకు కేంద్ర మంత్రులు సూచించగా వెంటనే ఏ నిర్ణయం చెప్పలేదు. సమావేశం అనంతరం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విలేకరులతో మాట్లాడారు. చర్చలను పురస్కరించుకుని ఏడాది లేదా ఏడాదిన్నరపాటు వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించాం. మా సూచనను రైతు సంఘాల నాయకులు చాలా సీరియస్‌గా తీసుకున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ విషయం రైతు సంఘాల నాయకులు గురువారం చర్చించుకుని ఈ నెల 22న చర్చల సందర్భంగా నిర్ణయాన్ని తెలుపుతారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాల అమలు వాయిదా అనే ప్రశ్నే లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నరపాటు వాయిదా వేస్తామని కేంద్ర మంత్రులు ప్రతిపాదనను తిరస్కరించామని భారతీయ కిసాన్ యూనియన్ (ఉఘ్రాన్) అధ్యక్షుడు జోగిందర్ సింగ్ ఉఘ్రాన్ తెలిపారు. కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చినందున గురువారం సమావేశమై చర్చిస్తామన్నారు.

ట్రాక్టర్ ర్యాలీపై వ్యాజ్యం ఉపసంహరణ

రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకోవడం లేదా అనుమతించడం తమ పని కాదని, అది ఢిల్లీ పోలీసుల పరిధిలోని అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం స్పందిస్తూ, ట్రాక్టర్ ర్యాలీపై తాము ఎటువంటి ఆదేశాలనూ జారీ చేయబోమని, అది పోలీసులకు సంబంధించిన అంశమని పునరుద్ఘాటించింది. ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తున్నామని, రైతుల ట్రాక్టర్ మార్చ్‌పై ఆదేశాలు జారీ చేయడానికి కేంద్రానికి అధికారాలున్నాయని పేర్కొంది. అనంతరం, ఆ వ్యాజ్యాన్ని కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకుంది.

సుప్రీంకోర్టు కమిటీ తొలి సమావేశం

కేంద్ర వ్యవసాయ చట్టాలపై చర్చించడానికి సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ మంగళవారం న్యూఢిల్లీలో మొదటి సారి సమావేశమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర రైతు సంఘాల నాయకుల అభిప్రాయాలను కోరుతున్నామని, ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలను కూడా ఒప్పించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. మరోవైపు కమిటీలో సభ్యుల ఎంపికపై వస్తున్న విమర్శలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే స్పందించారు. ఏదైనా ఒక అంశంపై అభిప్రాయాన్ని వెలిబుచ్చినంత మాత్రాన సదరు వ్యక్తి కమిటీలో నియమించడానికి అనర్హుడు కాడని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed