వరుస దాడుల వెనుక అంతుచిక్కని మర్మం..?

by  |
వరుస దాడుల వెనుక అంతుచిక్కని మర్మం..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : గత కొన్ని నెలలుగా తెలంగాణలో పలు నిర్మాణ సంస్థలపై ఐటీ, సీబీఐ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఇవి ఎవరిని టార్గెట్ చేస్తూ జరుగుతున్నాయి? ప్రాజెక్టుల కాంట్రాక్టులను దక్కించుకున్న ఈ సంస్థలపై దాడుల ద్వారా భవిష్యత్తులో ఏం జరగబోతోంది? తీగను లాగుతున్న దర్యాప్తు సంస్థలు డొంకను పట్టుకుంటాయా? బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పదేపదే కేసీఆర్ అవినీతి గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో తనిఖీలు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్, కరీంనగర్ నగరాలలో సోదాలు జరిగాయి. కాళేశ్వరం సబ్ కాంట్రాక్టు సంస్థలపై దాడులు జరగడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేఘా సంస్థ నుంచి మొదలైన దాడులు మిషన్ భగీరధ పనులను చేపట్టిన జీవీపీఆర్ సంస్థ దాకా వచ్చాయి. అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెబుతున్నారు. కేసీఆర్ అవినీతిని బయటకు లాగుతున్నామని బీజేపీ నేత విజయశాంతి అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచడం ద్వారా కమిషన్లు ఎవరి జేబులలోకి వెళ్లాయో తేలే సమయం ఆసన్నమైందని బండి సంజయ్ ఆరోపించారు. ఈ క్రమంలో దాడులు ఎవరిపై గురిపెట్టి జరుగుతున్నాయో అర్థంకాని అంశమేమీ కాదు. కాంగ్రెస్ సైతం పదేపదే లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు, రూ. 40 వేల కోట్ల మిషన్ భగీరధ కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూనే ఉంది.

‘సన్నిహిత’ కంపెనీల మీద..

ప్రపంచ చరిత్రలోనే మానవ అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం అభివర్ణిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టును దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థపై 2019 అక్టోబరులో ఐటీ సోదాలు జరిగాయి. సబ్ కాంట్రాక్టులు ఇవ్వడం మొదలు ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు. అంతకుముందే సీఎంకు సన్నిహితంగా ఉన్న ‘మై హోమ్’ సంస్థలో సోదాలు జరిగాయి. అనేక కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. రోటీన్‌గా జరుగుతున్న దాడులేనని ఆ సంస్థలు చెప్పుకున్నాయి. సీఎంకు సన్నిహితంగా ఉండే యశోద ఆసుపత్రి గ్రూపులోనూ ఐటీ సోదాలు జరిగాయి. కాళేశ్వరం సబ్ కాంట్రాక్టు సంస్థగా ఉన్న సీ-5 ఇన్‌ఫ్రా సంస్థలోనూ ఈ నెల 12న సోదాలు జరిగాయి. లెక్కలలో చూపని రూ. 160 కోట్లకు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థలు సృష్టించారని, పన్ను ఎగవేశారని, నకిలీ ఇన్‌‌పుట్ టాక్స్ క్రెడిట్ బిల్లుల్ని సృష్టించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థ డైరెక్టర్‌గా ఉన్న మదన్ మోహన్ రావు నివాసంలోనూ సోదాలు జరిగాయి. ఆయన డైరెక్టర్‌గా ఉన్న బృందావన్ స్పిరిట్స్, జేఎంఎం హోటల్స్, పౌలోమి ఎస్టేట్స్ లాంటి సంస్థలపైనా సోదాలు జరిగాయి. హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్‌లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

వీటి మీద కూడా..

మిషన్ భగీరధ కాంట్రాక్టు దక్కించుకుని మిర్యాలగూడలోనూ, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ లాంటి చోట్ల పైప్‌లైన్ నిర్మాణం చేపట్టిన జీవీపీఆర్ సంస్థపైనా ఈ నెల ఏడున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిగాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ‘ఈ-టెండర్’ కుంభకోణానికి సంబంధించి ఏడు కంపెనీలకు లింకు ఉందంటూ వచ్చిన ఆరోపణలలో భాగంగా ఈడీ ఈ సోదాలను నిర్వహించింది. ఆ ఏడు సంస్థలలో జీవీపీఆర్ కూడా ఒకటి. కాళేశ్వరం కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీలలో ఒకటిగా ఉన్నఐవీఆర్‌సీఎల్ సంస్థపైనా రూ. 4800 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించిన అంశంలో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టులతో ఎలాంటి సంబంధం లేని మరికొన్ని కంపెనీలపైనా సీబీఐ సోదాలు నిర్వహించింది. వారం రోజుల వ్యవధిలో ఆరేడు కంపెనీల మీద దాడులు జరగడం గమనార్హం. నైస్ మెరైన్ ఎక్స్‌పోర్ట్స్, సూర్యశ్రీ కాష్యూ, వాంటేజ్ మెషీన్, శ్రీ బాలాజీ ట్రేడింగ్, విజయదుర్గ గ్రీన్ ఫీల్డ్స్ లాంటి సంస్థలపై సీబీఐ కేసులు నమోదు చేసింది.

పన్ను చెల్లింపులో తేడాలున్నాయని..

ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే యశోద ఆసుపత్రి గ్రూపుపైనా ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సోదాలలో పన్ను చెల్లింపుల్లో వచ్చిన తేడాలపై ఆరా తీసినట్లు తెలిసింది. కరోనా సమయంలో లక్షలాది రూపాయలను రోగుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చినా, వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదులు అందినా తీసుకున్నచర్యలు మాత్రం శూన్యం. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉంటున్న సంస్థ కావడంతో చర్యలు తీసుకోడానికి అధికారులకు ధైర్యం ఉండదని విపక్షాలు ఘాటుగానే విమర్శించాయి. ఇలాంటి సమయంలో దాడులు జరగడం విశేషం.

నిజమవుతున్న ఆరోపణలు..

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడడంతో ఆ పార్టీ నేత బండి సంజయ్‌కు ఎక్కడ లేని ఊపు వచ్చేసింది. ముఖ్యమంత్రి అవినీతిని బయట పెడతామని, ఆయన జైలుకు వెళ్లక తప్పదని పదేపదే జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఆరోపించారు. వీటికి టీఆర్ఎస్ నేతలు ఘాటుగానే స్పందించారు. ఫలితాల అనంతరం బీజేపీకి మరింత బలం రావడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లాంటివారిని కలిసి ఏకాంత చర్చలు జరపడం, హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత దాదాపు రెండు వారాల పాటు ఫామ్ ‌హౌజ్‌కే పరిమితం కావడం, ఇదే సమయంలో బీజేపీ నేతలు విమర్శల దూకుడును పెంచడం ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోయాయి. సీఎం ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా టీఆర్ఎస్ నేతలు మాత్రం సైలెంట్‌గానే ఉండిపోయారు. ఈ దాడులు చివరకు ఏ రూపం తీసుకుంటాయో, ఎవరి మెడకు చుట్టుకుంటాయో అనేది చర్చనీయాంశమైంది.



Next Story