నాగార్జున యూనివర్శిటీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ

by Dishafeatures2 |
నాగార్జున యూనివర్శిటీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ
X

దిశ,కెరీర్: యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్ లతో పాటు ఇతర పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ప్రారంభమైంది. ఈ మేరకు యూనివర్శిటీ వీసీ పట్టేటి రాజశేఖర్ తక్షశిల ఐఏఎస్ అకాడమీతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. "యూపీపీఎస్సీ సివిల్ ఆస్పిరెంట్స్, పోటీ పరీక్షల కోసం సన్నద్దమయ్యే వారి కోసం ఇంటిగ్రేటెడ్ బీఏ, ఎం.ఏ పేరుతో కార్యక్రమాన్ని లాంచ్ చేసినట్లు ఆచార్య రాజశేఖర్ పట్టేటి పేర్కొన్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ ఎంఏ, బీఏ కోర్సుల్లో ముఖ్యంగా పబ్లిక్ పాలసీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, హిస్టరీ లాంటి సబ్జక్టులపై పట్టు వచ్చేలా అపార అనుభవం ఉన్న సిబ్బంది భోదిస్తారు.

ఈ సందర్భంగా ఆచార్య పట్టేటి రాజశేఖర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ .. తక్షశిల IAS అకాడమీతో భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. మా విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షకు అత్యుత్తమ నాణ్యత గల కోచింగ్‌ను పొందేందుకు, వారి కలలను సాకారం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశమని తెలిపారు. సివిల్ సర్వెంట్లుగా మారితే యూనివర్శిటీకి మంచి పేరు వస్తుందన్నారు. విద్యార్థులు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

తక్షశిల ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బి.ఎస్.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ విశిష్టమైన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో సహకరించడం సంతోషకరం అన్నారు. విశ్వవిద్యాలయంతో చేసుకున్న ఒప్పందంతో సివిల్స్, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు విద్యార్థులకు మంచి అవకాశం దొరికిందని తెలిపారు. సివిల్స్ ఔత్సాహికులకు వారి లక్ష్యాలను సాధించడానికి తక్షశిల మద్దతు అందించేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉంటుందన్నారు. అంతేగాకుండా పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటే వారికి కూడా ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జున విశ్వవిద్యాలయ దూరవిద్యా డైరెక్టర్ నాగరాజు, రెక్టార్ వరప్రసాద్ మూర్తి పాల్గొన్నారు.



Next Story

Most Viewed