భారత్ నెట్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

by  |
భారత్ నెట్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లోని గ్రామాలకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) మోడల్ ద్వారా భారత్ నెట్ అమలుకు కేంద్రం కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ పెంచడం, సేవల నుంచి ఆదాయం పొందేందుకు కేంద్రం ప్రైవేట్ రంగానికి అనుమతి ఇచ్చింది. సోమవారం నాటి ప్రకటనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశీయంగా ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని పెంచడానికి భారత్ నెట్ పథకం కోసం అదనంగా రూ. 19,041 కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు 16 రాష్ట్రాల్లోని మొత్తం 3,61,000 గ్రామాల్లో ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించడానికి పీపీపీ పద్ధతిలో అంతర్జాతీయ బిడ్డింగ్ నమూనాను అమలు చేయాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

దేశంలోని అన్ని గ్రామాల్లో సమాచార విప్లవం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ప్రకటన నిర్ణయాలను మంత్రి వర్గం ఆమోదించిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. కాగా, గతేడాది ప్రధాని మోడీ అన్ని గ్రామాలు వెయ్యి రోజుల్లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌తో అనుసంధానం అవుతాయని చెప్పారు. అందుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో భారత్ నెట్ పథకాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది మే చివరి నాటికి 1.56 లక్షల గ్రామ పంచాయితీలలో బ్రాడ్ బ్యాండ్ సేవల కోసం రూ. 42,068 కోట్లను కేటాయించారు. తాజాగా ఈ పథకానికి అదనంగా రూ. 19,041 కోట్లను కేటాయించారు.



Next Story

Most Viewed