- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
EPFO: వేరే అవసరాలకు పీఎఫ్ సొమ్ము వాడితే తిరిగివ్వాల్సిందే: ఈపీఎఫ్ఓ
విత్‌డ్రా చేసిన సొమ్మును ఇతర అవసరాలకు వాడితే దాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు కీలక విషయం తెలియజేసింది. చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్ కార్పస్ నుంచి విత్‌డ్రా చేసిన సొమ్మును ఇతర అవసరాలకు వాడితే దాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది. సాధారణంగా పదవి విరమణ తర్వాత లేదా 58 ఏళ్లు పూర్తయిన తర్వాత మాత్రమే పీఎఫ్ సొమ్ము తీసుకునే వీలుంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఇంటి నిర్మాణానికి, పిల్లల విద్య లేదా పెళ్లిళ్లు, అనారోగ్యం వంటి కారణాలకు కొంత మొత్తం పీఎఫ్ ఖాతా నుంచి తీసుకోవచ్చు. ఇందుకు కావాల్సిన పత్రాలు, కారణాలు చెప్పడం ముఖ్యం. అయితే, ఒక కారణానికి పీఎఫ్ సొమ్ము విత్‌డ్రా చేసి, ఆ మొత్తాన్ని వేరే అవసరాలకు వాడితే, దాన్ని తిరిగి వసూలు చేసే అధికారం ఈపీఎఫ్ఓకు ఉంటుందని పేర్కొంది. ఈపీఎఫ్ఓ పథకం-1952 కింద రికవరీ చర్యలు ఉంటాయి. సరైన కారణాల కోసం మాత్రమే పీఎఫ్ సొమ్మును ఉపయోగించాలని, పీఎఫ్ అనేది జీవితకాలానికి భద్రతను అందించే కవచం లాంటిదని ఈపీఎఫ్ఓ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈపీఎఫ్ స్కీమ్-1952లోని సెక్షన్ 68బీ(11) ప్రకారం.. నిబంధనలకు వ్యతిరేకంగా వేరే అవసరాలకు పీఎఫ్ సొమ్మును వాడితే, చందాదారులకు 3 ఏళ్ల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కోల్పోతారు. అంతేకాకుండా తీసుకున్న సొమ్మును వడ్డీతో పాటు చెల్లించాకే మళ్లీ విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంటుంది.






