- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిగ్ వర్కర్ల సమ్మెకు కారణాలేంటి? అట్టర్ ప్లాప్ అవడం నిజమేనా?
గిగ్ వర్కర్లు తలపెట్టిన రెండు రోజుల సమ్మెపై కంపెనీల వ్యూహం ఫలించిందా?

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు చేపట్టిన సమ్మెకు చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో, అమెజాన్ వంటి యాప్‌ల ద్వారా పని చేసే డెలివరీ పార్ట్‌నర్లకు తక్కువ ఆదాయం, స్పష్టత లేని వేతన విధానం వల్ల గిగ్ వర్కర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇన్‌సెంటివ్‌లు తరచూ మారిపోవడం, డెలివరీకి ఎంత దూరం వెళ్లినా సరైన డబ్బులు రాకపోవడం, గంటల తరబడి పని చేసినా సరైన ఆదాయం లేకపోవడం వంటివి ప్రధాన ఆరోపణలుగా చెబుతున్నారు. కిలోమీటర్‌కు కనీసం రూ.10 చెల్లించాలనే పాత విధానాన్ని తిరిగి తీసుకురావాలని, నెలకు కనీసం రూ.40 వేల గ్యారంటీ ఆదాయం ఇవ్వాలని గిగ్ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు.
అసలు కారణాలు ఇవేనా?
అయితే గిగ్ వర్కర్ల సమ్మెకు ముఖ్యమైన కారణం ఈ 10 నిమిషాల డెలివరీ పద్ధతి అంటున్నారు. చాలా వేగంగా డెలివరీ చేయాలనే ఒత్తిడితో వాహనాలు నడిపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని వర్కర్లు చెబుతున్నారు. టైమ్‌కు డెలివరీ చేయకపోతే పెనాల్టీలు, ఐడీ బ్లాకింగ్ జరుగుతుండటంతో భయంతో బైక్‌లను అతివేగంగా నడపాల్సి వస్తోందని అంటున్నారు. దీని వల్ల తీవ్ర గాయాలు, ప్రాణాలు పోవడం, మానసిక ఒత్తిడి పెరుగుతోందని, అందుకే ఈ ఫాస్ట్ డెలివరీ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని గిగ్ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇక గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత లేకపోవడం మరో పెద్ద సమస్య. గిగ్ వర్కర్లకు ఇన్సూరెన్స్, పెన్షన్, మెటర్నిటీ లీవ్, ఎమర్జెన్సీ లీవ్ వంటి మౌలిక హక్కులు లేవు. ప్రమాదం జరిగితే కుటుంబం రోడ్డు పాలవుతుందన్న భయం కూడా వారిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. తమను కాంట్రాక్ట్ పార్ట్‌నర్లుగా కాకుండా “వర్కర్లు”గా గుర్తించి లేబర్ చట్టాల పరిధిలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. అలాగే అన్యాయంగా ఐడీలు బ్లాక్ చేయడం, ఆర్డర్ క్యాన్సిల్ అయినా లేదా ఆలస్యం జరిగినా జరిమానాలు విధించడం వల్ల ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యల నేపథ్యంలో గిగ్ వర్కర్ల యూనియన్లు డిసెంబర్ 25 క్రిస్మస్ రోజుతోపాటు, డిసెంబర్ 31న అనగా న్యూ ఇయర్ ముందు రోజు సమ్మె చేస్తామని కంపెనీలకు అల్టిమేటం జారీ చేసాయి. భారీ గిరాకీ ఉండే ఈ రెండు రోజుల్లో సమ్మెకు దిగితే కంపెనీలు దిగివచ్చి తమ డిమాండ్స్ కు అంగీకరిస్తామని భావించారు. అయితే రియాలిటీలో మాత్రం అలా జరగలేదు. గిగ్ వర్కర్లు తలపెట్టిన రెండు రోజుల సమ్మె డిజాస్టర్ అయిందనే చెప్పాలి. యూనియన్లు లక్షల మంది గిగ్ వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారని చెప్పినప్పటికీ, వాస్తవంగా చూస్తే ఈ సమ్మె ప్రభావం చాలా తక్కువగానే కనిపించింది.
కంపెనీల వ్యూహం ఫలించిందా?
న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా స్విగ్గీ, జొమాటో వంటి ప్లాట్‌ఫారమ్ కంపెనీలు భారీగా ఇన్‌సెంటివ్‌లు ప్రకటించాయి. పీక్ అవర్స్‌లో ఒక్కరోజుకే రూ.2,000 వరకు అదనంగా ఇస్తామని కంపెనీలు ప్రకటించడంతో.. డిసెంబర్ 31 నుంచి జనవరి 1 మధ్య మొత్తం రూ.10,000 వరకు సంపాదించే అవకాశం రావడం వల్ల చాలా మంది వర్కర్లు సమ్మెను పక్కనపెట్టి పని చేయడానికే మొగ్గుచూపారు. యూనియన్లు 1 నుంచి 1.7 లక్షల మంది పాల్గొన్నారని చెప్పినా, దేశవ్యాప్తంగా 1.27 కోట్లకు పైగా ఉన్న గిగ్ వర్కర్లలో ఇది చాలా చిన్న సంఖ్యే.
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్కరోజే 4.5 లక్షల మంది డెలివరీ పార్ట్‌నర్లు.. 75 లక్షల రికార్డు ఆర్డర్లు పూర్తి చేశారని వెల్లడించారు. కొన్ని చోట్ల కంపెనీలు పోలీసుల సహాయంతో పరిస్థితిని కంట్రోల్ చేశాయన్న ఆరోపణలు వచ్చినా, ఎక్కువ మంది వర్కర్లు బెదిరింపుల వల్ల కాకుండా ఆర్థిక అవసరాల వల్లే పని చేయాల్సి వచ్చిందని యూనియన్లే అంగీకరించాయి. రోజువారీ ఆదాయంపైనే ఆధారపడే వర్కర్లకు సమ్మె చేస్తే ఆదాయం పోతుందన్న భయంతో సమ్మెను పక్కన పెట్టారని తెలిపాయి. దీనికితోడు యూనియన్లు బలహీనంగా ఉండటం, అన్ని వర్గాల వర్కర్లను ఏకతాటిపైకి తీసుకురాలేకపోవడం కూడా సమ్మె విఫలమవడానికి కారణమైంది. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి కొన్నిచోట్ల కొద్దిగా ఆలస్యం అయినా.. మొత్తం మీద గిగ్ వర్కర్ల డెలివరీ సేవలు సాధారణంగానే కొనసాగాయి. కంపెనీలు రికార్డు స్థాయిలో వర్కర్లకు రూ.100 కోట్లకు పైగా చెల్లించాయి.
ఫలితంగా తక్కువ వేతనం, 10 నిమిషాల డెలివరీ రద్దు, సోషల్ సెక్యూరిటీ వంటి ముఖ్యమైన డిమాండ్లను గిగ్ వర్కర్ల యూనియన్లు ఈ సమ్మె ద్వారా సాధించలేకపోయారు. అయితే ఇప్పటితో అంతా అయిపొయింది అనుకోవడానికి కూడా లేదు. భవిష్యత్తులో మరిన్ని సమ్మెలు జరిగే అవకాశాలు తప్పకుండా ఉన్నాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.






