భారత్‌లో ఈవీల ఉత్పత్తి, ఎగుమతులపై దృష్టి సారించిన ఫోక్స్‌వ్యాగన్

by Dishanational1 |
భారత్‌లో ఈవీల ఉత్పత్తి, ఎగుమతులపై దృష్టి సారించిన ఫోక్స్‌వ్యాగన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: జర్మనీకి చెందిన వాహన తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో తన ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ వాహనాన్ని(ఈవీ) విడుదల చేయనున్నట్టు కంపెనీ ఇండియా సీఈఓ పీయూష్ అరోరా తెలిపారు. ఈ దశాబ్దం ద్వితీయార్థంలో ఈవీ తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, అందుకోసం భారీ పెట్టుబడులకు కూడా సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ భారత మార్కెట్లో ఐదు విదేశీ బ్రాండ్లకు చెందిన వాహనాలను విక్రయిస్తోంది. వాటిలో ఆడి, పోర్షె మాత్రమే ప్రస్తుతం దేశీయంగా ఈవీలను విక్రయిస్తున్నాయి. 'భారత మార్కెట్లో ఈవీల విస్తరణ మరీ అంత వేగవంతంగా ఉండకపోవచ్చని భావిస్తున్నాం. అందుకే దేశీయంగా ఉత్పత్తి చేసి ఎగుమతులు చేపట్టే అవకాశాలను పరిశీలిస్తున్నాం. భారత్‌లో నియంత్రణ, భద్రతా పరమైన మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరిగింది. గతంలో దేశం నుంచి ఎగుమతులు చేయడం సంక్లిష్టంగా ఉండేదని' పీయూష్ అరోరా వివరించారు. భవిష్యత్తులో ఎగుమతులు మరింత పెరుగుతాయని, తమకు ఈ విభాగంలో మారుతీ సుజుకి, హ్యూండాయ్ లాంటి కంపెనీలు పోటీగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ కింద ఎగుమతులు 80 శాతానికి పైగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు స్కోడా ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయని స్పష్టం చేశారు. అందుకే దేశీయంగా ఈవీ ఉత్పత్తి, ఎగుమతులపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు.


Next Story

Most Viewed